
విజయనగరం అర్బన్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యేక హోదా అని, దానిని సాధించే వరకు పోరాటం ఆగదని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌లో మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రధాని మన్‌మోహన్‌సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఉన్నారని చెప్పారు.
ఈ డిమాండ్ సాధనలో భాగంగా పలు దఫాలు ప్రధాని మోదీని కలిసి వినతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే విషయంలో కేంద్రానికి సంబంధం లేదని, రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు తథ్యమని చెప్పారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలను అధిగమించి త్వరలోనే చట్టం చేస్తామన్నారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని రావడం ఖాయమని చెప్పారు. ఆయన వెంట ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ఉన్నారు.