బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ
బలమైన అభ్యర్థులను రంగంలో దింపిన మూడు పార్టీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ స్థానంపైనే ఉంది. తొలి మహిళా ప్రధాని ఇందిరాగాం«దీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వంటి కాకలుతీరిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు ప్రధాన పార్టీలు గట్టి అభ్యర్థులను బరిలో దింపగా, వారు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు.
ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు..విమర్శలు.. ప్రతివిమర్శలతో మెదక్ పార్లమెంట్ స్థానంలో రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం మీద ఈ స్థానంలో త్రిముఖ పోరు కొనసాగుతోందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, బీఆర్‌ఎస్ ఐదు పర్యాయాలు (ఉప ఎన్నికతో కలిపి) గెలిచాయి. బీజేపీ, టీడీపీ, పీడీఎఫ్, టీపీఎస్ ఒక్కోసారి విజయం సాధించాయి.
పట్టు నిలుపుకునేందుకు గులాబీ
2004 నుంచి రెండు దశాబ్దాలుగా ఈ పార్లమెంట్ స్థానం బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉంది. ఈసారి కూడా ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి.వెంకట్రాంరెడ్డిని బీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. గెలుపు బాధ్యత మాజీ మంత్రి హరీశ్‌రావు తన భుజాలపై వేసుకొని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఫలితాలను పునరావృతం చేసేందుకు బీఆర్‌ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.
పాగా వేసేందుకు బీజేపీ యత్నం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఒకేఒక దుబ్బాక సీటును కోల్పోయి.. ఘెర పరాజయం పాలైన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని ప్రయతి్నస్తోంది. ప్రధాని మోదీకి ప్రజల్లో ఉన్న చరిష్మాతో ఈ ఎన్నికల్లో ముందుకెళుతోంది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావును బరిలో దింపింది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఈ పార్టీ తరపున పోటీ చేసిన నందీశ్వర్‌గౌడ్ వంటి నాయకులు ఈ ఎన్నికల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. సంగారెడ్డి నుంచి పోటీ చేసిన పులిమామిడి రాజు పార్టీని వీడారు.
సత్తా చాటేందుకు హస్తం యత్నం
రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంలో సత్తా చాటేందుకు సై అంటోంది. వరుస చేరికలతో ఊపు మీదున్న హస్తం పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితర నాయకులను పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలంమధు ముదిరాజ్‌ను ఎంపిక చేసింది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేస్తుండగా., కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయతి్నస్తోంది.
ప్రభావితం చేసే అంశాలు
► మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాల భూనిర్వాసితుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహార పంపిణీ, పునరావాస కల్పన అంశాలు ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐదు వేల వరకు నిర్వాసిత కుటుంబాలున్నాయి.
► బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఆర్డినె న్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభు త్వరంగ సంస్థల్లో సుమారు 20 వేలమంది ఉద్యోగులున్నారు. వారితోపా టు కుటుంబసభ్యుల ఓట్లూ ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపనున్నాయి.
► యూపీ, బిహార్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కారి్మకులు పటాన్‌చెరు, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్నారు. చాలామంది ఇక్కడే స్థిరపడిపోయారు. వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.
► మెదక్ ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment