సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో కేటీఆర్
ప్రజలకు కొద్దిరోజుల్లోనే మనం యాదికొస్తాం
పార్టీ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
కొత్త ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం
లేదు.. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది
బీఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైంది
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ అన్న మాజీ సీఎం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం
కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులుగా వినోద్‌కుమార్, కొప్పుల ఖరారు
నేడు వీరిద్దరి పేర్లతోపాటు బీఆర్‌ఎస్ తొలి జాబితా ప్రకటించనున్న కేటీఆర్
కరీంనగర్ నుంచే ఎన్నికల శంఖారావం .. 12న భారీ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కారు ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. వాటి కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆదివారం తెలంగాణ భవన్‌కు విచ్చేసిన కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేశారు. అయితే ఆదివారం అష్టమి కావడంతో అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు కరీంనగర్, పెద్దపల్లితో పాటు మరికొన్ని స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో బీఆర్‌ఎస్ తొలి జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించనున్నారు. కాగా పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయాలి
విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైందని కేసీఆర్ చెప్పారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని, నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. అంతా కలిసి పని చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో గతంలో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ విమర్శించిందని, ప్రజల రక్తం పీలుస్తున్నారని వ్యాఖ్యానించిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. పైగా అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ కింద ఉచితంగా ప్లాట్లు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఓ పన్ను పాడైందని పళ్లన్నీ పీకేయలేం కదా!
ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని, మిడ్ మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలని, రాజకీయం చేస్తామంటే ప్రజలు గమనిస్తారని అన్నారు. ఒక పన్ను పాడైతే.. చికిత్స చేసుకుంటాం తప్ప.. మొత్తం పళ్లన్నీ పీకి వేసుకోలేం కదా? అని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేయాలని, మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. బీఆర్‌ఎస్‌కు గెలుపోటములు కొత్త కాదన్న ఆయన.. ఓడితే కుంగి పోయేది లేదు.. గెలిస్తే పొంగి పోయేది లేదని అన్నారు. కాంగ్రెస్‌లో వాళ్ల కుంపటి వాళ్ళు సర్దుకోవడానికే టైం సరిపోతుందని విమర్శించారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తామని, ధైర్యంగా ఉండాలని నాయకులకు భరోసా ఇచ్చారు.
మెజారిటీ సీట్లు మనవే..
ముందుగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ నెల 12న భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు. సభను విజయవంతం చేసే బాధ్యతను గంగుల కమలాకర్‌కు అప్పగించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలువబోతున్నదని చెప్పారు. అలాగే మెజారిటీ స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment