వాల్మీకి స్కాంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలెవరు?: కేటీఆర్‌ | BRS Leader KTR Comments On Congress Party Leaders | Sakshi
Sakshi News home page

వాల్మీకి స్కాంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలెవరు?: కేటీఆర్‌

Published Mon, Aug 26 2024 4:59 AM | Last Updated on Mon, Aug 26 2024 4:59 AM

BRS Leader KTR Comments On Congress Party Leaders

కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణలోని అకౌంట్లకు డబ్బులు వచ్చాయి  

సీఎం రేవంత్‌ సహా కాంగ్రెస్‌ నేతలు ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? 

సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం  కూలుతుందని కర్ణాటక మంత్రి ఎందుకన్నారు? 

సొంత పార్టీ అవినీతిపై రాహుల్‌ సమాధానం చెప్పాలి:  కేటీఆర్‌ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో వాల్మీకి స్కాం తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వైపు కదులుతోందని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్‌) ఆరోపించారు. తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్‌ నేతల హస్తం ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వాల్మీకి స్కామ్‌లో భారీగా అవినీతి జరిగిందని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే అసెంబ్లీలో అంగీకరించిన నేపథ్యంలో ఈ స్కామ్‌లో ఉన్న వారందరి పేర్లు బయటకు రావాల్సి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఆదివారం కేటీఆర్‌ మాట్లాడుతూ వాల్మీకి స్కాంకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. 

రూ. 180 కోట్లు దారిమళ్లాయి.. 
ఎన్నికలకు ముందు దాదాపు రూ.180 కోట్ల ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందులో రూ.45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని, ఆ బ్యాంక్‌ ఖాతాలు ఎవరివో తేల్చాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ ఆత్మహత్య చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. వీ6 పేరుతో ఉన్న బిజినెస్‌ సంస్థకు రూ.4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అసలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందుంచాలని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో ఆ డబ్బే వాడారా? 
మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ డబ్బే వాడినట్లుందని కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. వాల్మీకి స్కాం వ్యవహారంలో హైదరాబాద్‌లో సిట్, సీఐడీ, ఈడీ దాడులు నిర్వహించినప్పటికీ సీఎం రేవంత్‌ సహా కాంగ్రెస్‌ నేతలు మీడియాలో ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు తీసుకొచ్చినట్టు సమాచారం ఉందని, ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్న వారితో కాంగ్రెస్‌ పారీ్టకి ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణ సర్కార్‌ కూలుతుందా? 
కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తొలగిస్తే తెలంగాణలో కూడా ప్రభుత్వం కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్‌ జారకిహోళి వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ వాల్మీకి స్కాంతోనే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య బంధం పెనువేసుకుందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

ఈ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలున్నట్లు ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఈడీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో అవినీతిపై పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్‌ గాంధీ ఈ వాల్మీకి స్కాం విషయమై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే రాహుల్‌ ఈ విషయంపై స్పందించాలని, మొత్తం వ్యవహారంలో ఉన్న పెద్ద చేపల పేర్లను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement