సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్‌ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.
మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్‌ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment