తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాలకు చిరునామాగా ఉన్న పోరాటాల ఖిల్లా, ఉద్యమాల జిల్లా ఉమ్మడి వరంగల్‌లో 2023 ఎన్నికల సమరంలో తమ సర్వశక్తులొడ్డేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 2018 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గానూ 10 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. భూపాలపల్లి, ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా గండ్ర వెంకటరమణారెడ్డి, ధనసరి సీతక్క (అనసూయ) విజయం సాధించారు.
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 11కు చేరింది. ఇక వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్‌ఎస్ 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేట, భూపాలపల్లిలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. బీజేపీ 9చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.
అభ్యర్థుల ఎంపిక నుంచే వ్యూహాత్మకం...
రాజకీయ పార్టీలు ఈసారి అభ్యర్థుల ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ తొమ్మిది చోట్ల సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చినా.. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో డా.టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను మార్చింది. రైతుబంధు సమితి చైర్మన్‌గా రాజయ్యకు, ఆర్టీసీ చైర్మన్‌గా యాదగిరిరెడ్డిని నియమించి.. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు ఆ రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. ములుగు జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి తొలిసారిగా ములుగు నుంచి చాన్స్ ఇచ్చారు.
అయితే నామినేటెడ్ పదవులు ఇచ్చినా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో అభ్యర్థుల గెలుపునకు చేసే కృషిని బట్టి ఫలితాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేటలలో పాతవారికే (సీతక్క, సింగాపురం ఇందిర, దొంతి మాధవరెడ్డి)లకే అవకాశం ఇచ్చి భూపాలపల్లికి గండ్ర సత్యనారాయణరావును ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలకు ఐదు చోట్ల ఖరారు కాగా, మూడింట్లో పోటాపోటీగా ఉంది. ఆ ఐదు చోట్ల కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ ఉమ్మడి జిల్లాలో ములుగు, నర్సంపేట, పరకాల మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది.
ఆ రెండింటి మధ్యే పోరు... ఏఐఎఫ్‌బీ, బీఎస్‌పీ వైపు అసంతృప్తులు..
మొత్తం 12 స్థానాలకు రెండు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు రిజర్వు కాగా.. ఏడు జనరల్ స్థానాలు ఉమ్మడి వరంగల్‌లో ఉండగా... ఈసారి జరిగే ఎన్నికల్లో సామాజిక కోణాలు ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం ఆచితూచి పావులు కదుపుతున్నాయి. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రచారసభలు నిర్వహించగా.. కాంగ్రెస్ తరఫున ఈ నెల 18, 19 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాంధీలు బస్సుయాత్రను రామప్ప వేదికగా ప్రారంభించి ప్రచారం నిర్వహించారు.
రెండు రోజులపాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. చాలా నియోజకవర్గాల్లో పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా కూడా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) వైపు చూస్తున్నారు.
- గడ్డం రాజిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment