సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత మొదలైన అసమ్మతికి చెక్ పెట్టడంపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలతో మంతనాలు జరుపుతూ కలసి ఉంటే రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉంటుందంటూ బుజ్జగిస్తోంది. బెట్టు వీడకుండా తలనొప్పులు సృష్టిస్తున్న నేతలు పార్టీని వీడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే రీతిలో సంకేతాలు పంపిస్తోంది.
అసంతృప్త నేతలను దారికి తెచ్చుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయ త్నాలు సాగిస్తూనే.. మాట వినని నాయకులకు క్రమంగా ద్వారాలు మూసివేస్తోంది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు అసంతృప్తులకు కౌన్సెలింగ్ చేస్తూ బుజ్జగిస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తిరిగిరాగానే ఆయనను కలిసేందుకు కొందరు అసంతృప్తులు సిద్ధంగా ఉన్నారు.
ఆ నియోజకవర్గాల్లో సస్పెన్స్
చాలా చోట్ల అసమ్మతుల విషయం ఓ కొలిక్కి వస్తున్నట్టు కనిపించినా.. మెదక్, నర్సాపూర్, జహీరాబాద్, కల్వకుర్తి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మల్కాజిగిరి వంటి పలుచోట్ల మాత్రం అంతర్గత విభేదాలు కొంతమేర ప్రభావం చూపే స్థాయిలో ఉన్నాయని బీఆర్‌ఎస్ పెద్దలు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే రేఖా నాయక్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇప్పటికే పార్టీని వీడటం ఖాయం కావడంతో వారితో బీఆర్‌ఎస్ ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని తెలిసింది.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విషయంలోనూ బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి వేచిచూసే ధోరణితో ఉన్న మరో నలుగురైదుగురు ముఖ్య నేతలు పార్టీని వీడే అవకాశముందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలలో టికెట్ల కేటాయింపు తర్వాత తలెత్తే అసంతృప్తిని అనుకూలంగా మల్చుకుని, కొందరు నేతలను బీఆర్‌ఎస్‌లోకి స్వాగతించాలన్న దిశగా కసరత్తు జరుగుతోంది.
బుజ్జగింపులు, చర్చలతో..
► చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గతంలో కొంతకాలం కాంగ్రెస్‌లోకి వెళ్లి, మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో సయోధ్య కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వ్యతిరేకిస్తుండగా.. ఎమ్మెల్యేతో పొసగని ఓ జెడ్పీటీసీ, ఎంపీపీ బీఆర్‌ఎస్‌ను వీడారు. ఆసిఫాబాద్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పార్టీ అభ్యర్థులతో కలసి పనిచేసేందుకు సిద్దమవుతున్నారు.
► సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 15న నియోజకవర్గంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
► రామగుండంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అసమ్మతిని కొనసాగిస్తూ.. సొంతంగా సింగరేణి కార్మికులతో భేటీ వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వేములవాడ టికెట్ దక్కని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కేబినెట్ హోదాలో వ్యవసాయ రంగ ప్రత్యేక సలహదారుగా నియమితులవడం ద్వారా అక్కడ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు మార్గం సుగమమైంది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీఆర్‌ఎస్‌లో కొనసాగడంపై ఊగిసలాట ధోరణితో ఉన్నారు.
► ఉమ్మడి మెదక్ జిల్లాలో అసమ్మతి కట్టడికి మంత్రి టి.హరీశ్‌రావు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్‌రావు సొంత కార్యాచరణతో మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జహీరాబాద్‌లో టికెట్ ఆశించిన ఏర్పుల నరోత్తమ్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మరోనేత ఢిల్లీ వసంత్ మాత్రం తనదైన శైలిలో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు.
సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌కు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ‘తెలంగాణ ఉద్యమకారుల వేదిక’ నాయకులు ఇటీవల మంత్రి హరీశ్‌తో అయ్యాక తమ సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన పులిమామిడి రాజు ఈ నెల 11న బీజేపీలో చేరడం ఖాయమైంది. పటాన్‌చెరు టికెట్ ఆశిస్తున్న నీలం మధు గతంలో మంత్రి హరీశ్‌ను కలిశారు. కేటీఆర్‌ను కలిశాక తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక నర్సాపూర్ టికెట్ తమకే దక్కుతుందంటూ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఎవరికి వారే చెప్తున్నారు.
► జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం టికెట్‌పై చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణి అవలంబిస్తానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్తున్నారు.
► మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
► మంత్రి హరీశ్‌రావుతో భేటీ తర్వాత కల్వకుర్తి అసమ్మతి స్వరం సద్దుమణిగింది. కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఓ కీలక నేత త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాగార్జునసాగర్‌లోనూ అసమ్మతి నేతలు నిరసనలు కొనసాగుతున్నాయి.
కలిసొస్తే ఓకే.. లేకుంటే వేటే!
Published Sun, Sep 10 2023 6:02 AM | Last Updated on Sun, Sep 10 2023 6:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment