భోపాల్: ఈ సార్వత్రిక ఎన్నికలు భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంకర్ ముంజరే తాత్కాలికంగా ఇంటిని వీడి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇంట్లో అడుగు పెట్టను అని కఠిన నిర్ణయం తీసుకున్నారు.
తన ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని బీఎస్‌పీ అభ్యర్థి కంకర్ ముంజరే శనివారం తెలిపారు. తన తన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభా ముంజరే అక్కడ ఉంటున్నారని, ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సిద్ధాంతాలను అనుసరిస్తున్నప్పుడు ఒకే పైకప్పు కింద ఉండకూడదని అన్నారాయన. ఏప్రిల్ 19న పోలింగ్ రోజు తర్వాతే ఇంటికి తిరిగి వెళ్తానని మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కంకర్ ముంజరే చెప్పారు.
"నేను శుక్రవారం నా ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆనకట్ట సమీపంలో ఒక గుడిసెలో నివసిస్తున్నాను. వేర్వేరు భావజాలాన్ని అనుసరించే ఇద్దరు వ్యక్తులు ఒకే పైకప్పు కింద నివసిస్తుంటే, అది మ్యాచ్ ఫిక్సింగ్ అని ప్రజలు భావిస్తారు ” అని ఆయన పీటీఐతో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భార్య అనుభా ముంజరే బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బిసెన్‌ను ఓడించారు.
అయితే తన భర్త నిర్ణయంతో బాధపడ్డానని, పెళ్లి అయి మెట్టినింటికి వెళ్లిన మహిళ చనిపోయే వరకు అక్కడే ఉంటుందని అనుభా ముంజరే చెబుతున్నారు. గతంలో ఆయన ఇక్కడి పరస్వాడ నుండి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు, తాను కాంగ్రెస్ టిక్కెట్‌పై బాలాఘాట్ నుండి పోటీ చేసినప్పుడు తాము కలిసే ఉన్నామని తెలిపారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తనని, బాలాఘాట్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సామ్రాట్ సరస్వత్ విజయానికి కృషి చేస్తానని అనుభా ముంజరే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment