తిరుమలగిరిలో పాదయాత్ర చేస్తున్న ప్రవీణ్‌కుమార్
తిరుమలగిరి(తుంగతుర్తి): ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ఎలాంటి మార్గదర్శకాలు లేకుండానే ప్రవేశపెట్టారని, ఇది దళితులను మభ్యపెట్టడానికి ఆడుతున్న డ్రామా అని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకే దళితబంధు పథకం దక్కుతోందని ఆరోపించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాధికార యాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సాగింది.
ఉదయం స్థానిక రైతులతో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు మోసానికి గురయ్యారన్నారు. రైతుబంధు పథకం భూస్వాములకు బంధుగా మారిందని ఆరోపించారు. ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదని మండిపడ్డారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు.
దళితబంధు పథకం ఇప్పిస్తామని దళారులు తయారయ్యారని, ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు దండుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించడంతో రైతుల బోర్లు ఎండి పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
బీఎస్పీకి అధికారం ఇస్తే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పాలక వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సిద్ధించినప్పుడే అన్ని సామాజిక వర్గాల పేదరికం రూపుమాపడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, నియోజకవర్గ ఇన్‌చార్జి బల్గూరి స్నేహ, జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment