సాక్షి, హైదరాబాద్: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ముగుస్తోంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో పడ్డారు. వీలైనంత మందిని ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు గత నెల 16న నోటిఫికేషన్ వెలువడగా.. ఈ నెల 14న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. 2015లో ఈ రెండు సీట్లకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి రెట్టింపు ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ రెండింటిలో 10.36 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా.. ఏకంగా 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఉద్యమ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పలు రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో కీలక అభ్యర్థులంతా ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సంస్థల మద్దతు కూడగట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో.. చెరోచోట సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీలు.. సిట్టింగ్‌ను కాపాడుకుంటూనే, రెండో స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హైవోల్టేజీలో ప్రచారం సాగింది. రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్‌పై ప్రధాన పార్టీల మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీఐఆర్ పూర్తిస్థాయి డీపీఆర్‌లను కేంద్రం ఎన్నిసార్లు కోరినా రాష్ట్రం ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తే.. ఐటీఐఆర్‌ను కేంద్రమే రద్దు చేసిందని, కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పార్లమెంట్‌లోనే ఈ విషయం చెప్పిన సంగతి తెలియకపోవడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు రాసిన కేంద్రానికి లేఖలు, డీపీఆర్‌లు ఇస్తామని.. దమ్ముంటే ఐటీఐఆర్ తేవాలని సవాల్‌చేశారు. ఇక టీఆర్‌ఎస్ సర్కారు సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదని, 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. తాము 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
టీఆర్‌ఎస్: బలమంతా కేంద్రీకరించి..
తొలుత కేవలం సిట్టింగ్ సీటు ‘వరంగల్- ఖమ్మం-నల్గొండ’లోనే పోటీ చేస్తుందని భావించిన టీఆర్‌ఎస్.. చివరి నిమిషంలో ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’లోనూ బరిలోకి దిగింది. మాజీ ప్రధాని పీవీ కూతురు వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ సీట్ల పరిధి ఏకంగా ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండటంతో టీఆర్‌ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ బరిలోకి దింపింది. 14 మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. క్షేత్రస్థాయి దాకా ప్రచారం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి, కుల, సామాజిక సంఘాల మద్దతు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ప్రతి 50 మంది పట్టభద్ర ఓటర్లను చేరుకునేందుకు నాయకులు, చురుకైన కార్యకర్తలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టి మద్దతు తీసుకుంటోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్నా.. వివిధ కోణాల్లో అందుతున్న నివేదికల అధారంగా ఎన్నికల ఇన్‌చార్జిలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కాంగ్రెస్: పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ..
రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ సంస్థాగతంగా మండలాలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచార సమావేశాలు ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయగా.. వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డికి ‘హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్’, భట్టి విక్రమార్కకు ‘వరంగల్-ఖమ్మం- నల్లగొండ’ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ వీలైనన్ని చోట్ల వివిధ కేటగిరీల వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాములు నాయక్, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపుతూ ప్రచారం నిర్వహించింది. 2019లో జరిగిన ‘కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్’ ఎన్నికలో కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్‌రెడ్డి గెలిచిన తరహాలోనే.. ఇప్పుడు కూడా ఫలితాలు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది.
బీజేపీ: టీఆర్‌ఎస్ టార్గెట్‌గా ప్రచారం
ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ‘వరంగల్- ఖమ్మం- నల్లగొండ’ సీటును కూడా గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరహాలోనే ఈ రెండు చోట్ల గెలుస్తామని భావిస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తరహాలోనే అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించిన బీజేపీ.. ప్రతి 25 మంది పట్టభద్ర ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించింది. పార్టీ అనుబంధ సంఘాలు, ఆర్‌ఎస్‌ఎస్ కూడా క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర మంత్రులు రమేశ్ పోఖ్రియాల్, ప్రకాశ్ జవదేకర్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఇతర కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పాలన, సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది.
సర్వశక్తులు ఒడ్డుతున్న స్వతంత్రులు
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, యువ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, వృత్తి సంఘాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
డిగ్రీ ఓటరుల్లారా ‘పట్టం’ కట్టండి
Published Fri, Mar 12 2021 1:50 AM | Last Updated on Fri, Mar 12 2021 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment