చెన్నై: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే పౌర యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు కన్యాకుమారిలో మీడియాతో మాట్లాడారు గహ్లేత్.
కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీనే చేపట్టాలని, తనతో పాటు అనేక మంది పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని గహ్లోత్ అన్నారు. పార్టీ బలోపేతానికి ఇది ఎంతో అవసరం అన్నారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, రాహుల్ గాంధీ వాటిని పరిష్కరించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ ప్రజల మధ్య సోదరభావం, ప్రేమ ఉండాలని, కానీ అందుకు విరుద్ధంగా విద్వేషం, హింస సృష్టిస్తున్నారని గహ్లోత్ విమర్శించారు. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య విభజన రేఖ గీస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వీటిపై ఏ రోజూ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇది దేశానికి ఎంత మాత్రమూ మంచిదికాదన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనని రాహుల్ గాంధీ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే గాంధీ కుటుంబసభ్యుల తరఫున ఆశోక్ గహ్లేత్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారు. మరోవైపు గాంధీ కుటుంబసభ్యులే పార్టీ పగ్గాలను చేపట్టాలని వారి విధేయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోద్ తివారీ, వీ హనుమంతు రావు సహా మరికొంత మంది నేతలు ఈ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశఆరు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. 19న ఫలితాలు ప్రకటిస్తారు.
చదవండి: చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు
Comments
Please login to add a commentAdd a comment