ప్రజల్లో ఆదరణ లేకపోయినా పొత్తులతో గట్టెక్కుదామని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేసిన ఎత్తులు ఇప్పుడు ఆ పార్టీలో సీనియర్ నేతల ఆశలను అడియాసలు చేస్తోంది. పొత్తులో సీటు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో పాడేరు నాయకుల రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లు సీటు కోసం పట్టుపట్టి గ్రూపులుగా విడిపోయిన నాయకులు ఇప్పుడు మాలో ఎవరికో ఒకరికి ఇవ్వండి అంటూ వేడుకునే పరిస్థితి ఏర్పడింది. అధినేతను కలిసి తమ గోడు వెల్లబుచ్చుకుందామంటే కనీసం అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో అమరావతిలో ఎదురుచూపులతో ఐదు రోజులుగా కాలం గడుపుతున్నారు.
పాడేరు : పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలని గంపెడు ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకులకు చుక్కెదురు కానుంది. పొత్తులో భాగంగా ఈసారి కూడా మిత్రపక్షమైన బీజేపీకి పాడేరు అసెంబ్లీ టికెట్ కేటాయించేందుకు దాదాపుగా కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పాడేరు నియోజకవర్గంలోని టీడీపీలో టికెట్ ఆశిస్తున్న వారితో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా నైరాశ్యం నెలకొంది. గత 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని టీడీపీకి ఈసారి కూడా పోటీ చేసే అవకాశం లేకపోతే దాదాపుగా పార్టీ ఉనికే ప్రశ్నర్థాకంగా మారుతుందని నాయకులు, కేడర్ ఆందోళన చెందుతున్నారు. ఎలాగైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి పరిస్థితిని వివరించి టీడీపీకి పాడేరు టికెట్ కేటాయించేలా ఒత్తిడి తేవాలని భావించినా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
రెండు సార్లు ఓటమి... రెండు సార్లు పోటీకి దూరం
1999లో పాడేరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మత్య్సరాస మణికుమారి 2004 వరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మణికుమారి ఘోర ఓటమి పాలయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో మిత్రపక్షాలకు టికెట్ కేటాయించడంతో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నియోజకవర్గ ప్రజలు తమ ఓటుతో సరైన గుణపాఠం చెప్పడంతో ఘోరంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా గిడ్డి ఈశ్వరి కొనసాగుతున్నారు.
వర్గ పోరు
టీడీపీలో ముందునుంచి టీడీపీలో మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, సీనియర్ నేత బొర్రా నాగరాజు, మాజీ ఎమ్మెల్యే తనయుడు, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీఎస్ ప్రసాద్, మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు ఉన్నారు. అప్పటి నుంచే టీడీపీలో వర్గ పోరు నడుస్తోంది. ఇక 2024 ఎన్నికల సమయానికి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసిన కిల్లు రమేష్‌నాయుడు, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావులతో మరో రెండు వర్గాలు తయారయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీఎస్ ప్రసాద్, కిల్లు రమేష్‌నాయుడు టికెట్ ఆశిస్తున్నారు.
వర్గాలతో సతమతమవుతున్న పాడేరు టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు సహకరించరని భావించి పొత్తుల్లో భాగంగా ఈసారి కూడా పాడేరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. పది రోజుల కిందట విజయవాడకు వెళ్లిన టీడీపీ టికెట్ ఆశావాహులకు పొత్తుల్లో భాగంగా ఈసారి పాడేరు అసెంబ్లీ టికెట్‌ను బీజేపీకి కేటాయిస్తున్న ట్టు కరాఖండీగా అధిష్టానం చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈనెల 13న తన అనుచరులతో తన నివాసం వద్ద అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 15న తన అనుచరులతో పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బల ప్రదర్శన జరిపారు. ఈసారి పాడేరు అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ శ్రేణులు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని, పైగా అంతగా పట్టులేని బీజేపీకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని నినాదించారు. పార్టీ కింద స్థాయి కేడర్, ఆశావాహుల అనుచరుల ఒత్తిడి మేరకు వర్గాలుగా ఉన్న టీడీపీ నాయకులు ఒక్కటయ్యారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపించుకుందామని వారంత నిర్ణయించుకున్నారు.
బీజేపీకే టికెట్
పొత్తుల్లో భాగంగా పాడేరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించేశారని, ఈ విషయంలో ఎటువంటి పునరాలోచన లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం స్పష్టం చేసిందని, అయినప్పటికి మళ్లీ టీడీపీకి కేటాయించాలని వెంపర్లాడటం కరెక్ట్ కాదని బీజేపీ నాయకులు అంటున్నారు.
అమరావతిలో పడిగాపులు
వర్గాలుగా ఉన్న తామంతా ఒక్కటయ్యామని, ఈసారి టీడీపీకి టికెట్ కేటాయించాలని, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాయు నాయుడును కలిసి చెప్పుకుందామని పార్టీకి చెందిన టికెట్ ఆశావాహులు ఐదు రోజుల క్రితం అమరావతి వెళ్లారు. అప్పటి నుంచి అధినేత దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తుల్లో భాగంగా మిత్ర పక్షమైన బీజేపీకి పాడేరు నియోజకవర్గం స్థానం దాదాపుగా కేటాయించినందునే పాడేరు నాయకులకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఇష్ట పడడం లేదని వినికిడి. ఒక వైపు వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థులకు ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా పాడేరు నియోజకవర్గంలో పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి టికెట్ కేటాయిస్తారో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు అంతుపట్టడం లేదు. టికెట్ కేటాయింపు విషయంలో మూడు పార్టీల్లో స్పష్టత లేకపోవడంతో ఇప్పటికే టీడీపీలో ఉన్న కిందస్థాయి నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment