వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోని ఇతర నేతలు కూడా అదే బాట పడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబ సభ్యలకే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. తమ ఎదుగుదలకు కృషి చేసిన రక్త సంబంధీకులనే పాతాళానికి తొక్కిపెడుతున్నారు. టీడీపీలోని కొందరు సీనియర్ల వెన్నుపోటు రాజకీయాలు పచ్చ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎవరికి ఎర్త్ పెడితే ఇంకెవరికి లాభం?
తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కుటుంబ సభ్యులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడంలో చంద్రబాబు నాయుడునే ఆదర్శంగా తీసుకుంటున్నారు. చంద్రబాబు ఎలా అయితే సొంత మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం లాక్కున్నారో..ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు తనకోసం ఎంత కష్టపడినా చివరికి వారిలో ఎవరికీ రాజకీయ భవిష్యత్ లేకుండా ఎలా చేశారో..ఇప్పుడు టీడీపీలోని కొందరు నేతలు కూడా అదే తీరును ప్రవర్తిస్తున్నారు. తమ నేత పేటెంట్ హక్కుగా ఉన్న వెన్నుపోటు రాజకీయాలను తాము ఒంటబట్టించుకుంటున్నారు.
తమ రాజకీయ ఎదుగుదలలో అనునిత్యం అండగా ఉన్న సొంత కుటుంబసభ్యులనే రాజకీయంగా అణగదొక్కుతున్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌ను చంద్రబాబు ధ్వంసం చేశారు. బావమరిది హరికృష్ణను..ఆయన కుమారుడు జూనియర్ ఎన్‌టీఆర్‌ను టీడీపీలో ఎదగనీయకుండా అణగదొక్కారు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కడే ఎన్‌టీఆర్ వారసుడిగా టీడీపీలో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్నారు. అది కూడా వియ్యంకుడు కావడం వల్లనే బాలకృష్ణకు ఆమాత్రమైనా గుర్తింపు దక్కింది. కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ఎన్‌టీఆర్‌ను పార్టీకి దూరం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రతీ జిల్లాలో వెన్నుపోట్ల పర్వం
ఇటీవల కాలంలో తుని అసెంబ్లీ సీటు విషయమై యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు కృష్ణుడు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం సొంత తమ్ముడుకే యనమల వెన్నుపోటు పొడుస్తున్నారు. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తన కుటుంబ ఆధిపత్యానికి సోదరుడు సన్యాసి పాత్రుడు అడ్డు తగులుతాడని భావించి ఆయన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు. సోదరుడు టిడిపిలో ఉంటే తన కుమారుల రాజకీయ ఎదుగుదలకు అడ్డు తగులుతారని భావించి చంద్రబాబు తరహాలోనే సొంత సోదరుడిని తొక్కి పెట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో అచ్చం నాయుడు కూడా తన సోదరుడు ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత రోజు రోజుకి పార్టీలోనూ, జిల్లాలోనూ తగ్గిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్న రామ్మోహన్‌నాయుడికి ఇప్పటినుంచి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిది కూడా అదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు విషయమై కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య విభేదాలు తలెత్తాయి. తన సోదరుడు సేవా కార్యక్రమాల పేరుతో ఎదిగితే తనకు తన కుమార్తె రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అధిష్టానంతో నాని గొడవ పెట్టుకున్నారు.
ఇదండీ వెన్నుపోట్ల చరిత్ర
వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒకే సీటు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సీట్ కోసం కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ పోటీ పడుతున్నారు. కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబు సీటు కోసం సోదరుడు ప్రభాకర్ ను ఇప్పటి నుంచే తొక్కేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భూమా ఫ్యామిలీకి కూడా ఒకే సీట్ అని టిడిపి అధిష్టానం స్పష్టం చేసింది. నంద్యాల సీటు కోసం భూమా అఖిలప్రియ, ఆమె పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరు ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు.. బ్రహ్మానందరెడ్డిని పక్కకు తప్పించేంకు అఖిలప్రియ ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం లో పనిచేస్తున్న టీడీపీ సీనియర్ నేతలంతా ఆయన బాటలోనే నడుస్తూ తమకు మేలు చేసిన వారిని.. తమను నమ్మి వెంట ఉన్న వారిని చంద్రబాబు తరహాలోని వెన్నుపోటు పొడుస్తున్నారు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment