అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం | Chandrababu Two Eyes Theory | Sakshi
Sakshi News home page

అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం

Published Mon, Nov 1 2021 9:11 AM | Last Updated on Mon, Nov 1 2021 2:41 PM

Chandrababu Two Eyes Theory - Sakshi

‘‘రాజకీయాల్లో రెండు కళ్ల సిద్ధాంతం’’... అంటేనే గుర్తుకు వచ్చేది చంద్రబాబునాయుడు పేరే.. ఆ పదానికి ప్రపంచంలోనే ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌..  ఓసారి బీజేపీతో పొత్తు.. మరోసారి బీజేపీ సిద్ధాంత వ్యతిరేక భావజాలం కలిగిన కమ్యూనిస్టులతో పొత్తు.. ఇంకో ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో.. ఈసారి కాదు కాదు తిరిగి కమ్యూనిస్టులతోనే.. గత ఎన్నికల్లో అయితే... ఏకంగా కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై నిర్మించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా చివరికి హస్తం పార్టీతోనే పొత్తు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే అసలు సిద్ధాంతం.. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు అని అనుకుంటున్నారా.. పూర్తి కథనంలోకి రండి.. (చదవండి: బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!)

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎవరైనా ఎక్కడైనా తమ ఊరు బాగుపడాలని  కోరుకుంటారు.. క్రమక్రమంగా ఊరు అభివృద్ధి చెంది పట్టణీకరణ చెందాలని ఆశపడుతుంటారు.. ఊరు కాని ఊరు తనకు పట్టం కడితే.. ఒక సారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా 35 ఏళ్ల పాటు  ప్రజాప్రతినిధిగా తిరుగులేని విజయాన్ని అందిస్తే.. ఆ ఊరుని కనీవినీ ఎరుగని విధంగా బాగుచేయాలని ఎవరైనా భావిస్తారు.. ఆ మేరకు ఎంతైనా.. ఏమైనా చేస్తారు.. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు?.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన గురించి చెప్పేదేముంది. తనకు ఓ రకంగా రాజకీయ పునర్జన్మను.. మూడు దశాబ్దాలకి పైగా కంచుకోటగా నిలిచిన కుప్పంను ఎప్పటికీ పల్లెటూరుగానే ఉండిపోవాలని ఆయన భావిస్తున్నారు. మూడు రాష్ట్రాల కూడలి అయిన కుప్పం పట్టణంగా అభివృద్ధి చెందితే.. కుదరదు.. కనీస సౌకర్యాలు లేకుండా సమస్యలతో కునారిల్లుతూ అది పంచాయతీగానే ఉండిపోతే బాగుండేదని అంటున్నారు.

చదవండి: ఇదేనా బాబూ.. మీ క్రమశిక్షణ?

2015లో బాబు హయాంలోనే మున్సిపాలిటీ చేయాలని తీర్మానం 
టీడీపీ అధికారంలో ఉన్న 2015లో అక్టోబర్‌ నెలాఖరున కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా చేయాలని కోరుతూ సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి.. అప్పటి జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపారు. కుప్పం మేజర్‌ పంచాయతీ సహా చుట్టుపక్కల ఉన్న 11 పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీ చేయాలని తీర్మానం పంపారు. ఆ సందర్భంలోనే చంద్రబాబు కూడా కుప్పంను అభివృద్ధి చేసే దిశగా మున్సిపాలిటీ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అక్కడితో మర్చిపోయారు.. కుప్పం అభివృద్ధే కాదు.. మున్సిపాలిటీ చేయాలన్న విషయాన్ని కూడా అటకెక్కించేశారు.

2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీ హోదా 
కుల, మత, పార్టీ, వర్గ రహితమైన పాలన అందించే లక్ష్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ తొలినాళ్లలోనే కుప్పానికి మున్సిపాలిటీ హోదానిచ్చింది. సీ గ్రేడ్‌ మున్సిపాలిటీ హోదాలో కుప్పం అభివృద్ధికి నిధులను కేటాయించింది. మౌలిక వసతులతో పాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి వంటి సమస్యలకు పరిష్కారం చూపింది. ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉన్న సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీల  నిర్మాణం పూర్తి చేసింది. పట్టణంలోని ప్రతి చోటా తాగునీటి సౌకర్యానికి బోర్ల నిర్మాణం చేపట్టింది.

అదే బాబు.. మళ్లీ ఇప్పుడు ఇలా 
త్వరలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజుల పాటు వీధి వీధి తిరిగిన చంద్రబాబు కుప్పానికి అనవసరంగా మున్సిపాలిటీ హోదా ఇచ్చారని విమర్శించారు. రెండురోజుల పర్యటనలో రాజకీయ విమర్శలు పక్కనపెడితే  అనవసరంగా కుప్పంను మున్సిపాలిటీ చేశారని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు కుప్పం ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు భగ్గుమంటున్నారు.

కుప్పం అభివృద్ధి చూడలేకపోతున్నావా బాబూ 
– చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కుప్పం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భరత్‌ ధ్వజం 
దశాబ్దాలకాలంగా వెనుకబాటుకు గురైన కుప్పంను అన్ని ప్రాంతాలతో పాటు సమగ్ర అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యం.. ఆ మేరకు కుప్పంను ప్రగతి బాట పట్టిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఆయన లక్ష్యం ఏమిటంటే... ఈ ప్రాంతం ఎప్పుడూ వెనుకబాటులోనే ఉండాలి. కనీసంగా కూడా ఇక్కడి ప్రజలకు వసతులు, సౌకర్యాలు రాకూడదు.. అందుకే కుప్పం ఎప్పటికీ ఓ కుగ్రామంగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. బాబు దుర్మార్గమైన ఆలోచనలను కుప్పం ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే జెడ్పీటీసీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా బాబుకు సరైన బుద్ధి చెబుతారు. కుప్పం టీడీపీ నేతలు కూడా బాబు దుర్బుద్ధి అర్థం చేసుకోవాలి. 

మున్సిపాలిటీతోనే కుప్పం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది 
– కమిషనర్‌ చిట్టిబాబు 
52 వేలకు పైగా జనాభా ఉన్న కుప్పం ఇంకా పంచాయతీగా ఉంటే ఏం అభివృద్ధి సాధిస్తుంది. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన తర్వాతే అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. పంచాయతీగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్‌ నుంచి నిధులు వస్తాయి. ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత టిడ్కో నిధులు పెరుగుతాయి. మౌలిక సదుపాయాల కల్పనకు నేరుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. పన్నులు భారీగా పెరుగుతాయనే వాదనల్లో వాస్తవం లేదు. పన్నుల పెంపుపై సీలింగ్‌ ఉండడంతో 15 శాతానికి మించి పెరగడానికి వీల్లేదు. మున్సిపాలిటీ గ్రేడ్‌ వచ్చిన తర్వాత ఈమధ్యనే కుప్పానికి ప్రత్యేకంగా మూడున్నర కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటితో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు చేస్తున్నాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement