రాష్ట్రవ్యాప్తంగా కత్తులు నూరుతున్న మైనారిటీలు
2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని బాబు అమలుచేయలేదని మండిపాటు
క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలను దగా చేశాడంటూ ఆగ్రహం
మరోసారి మోసం చేసేందుకే పొత్తులు
బీజేపీ, జనసేనతో కలిసి వస్తున్న బాబుకు బుద్ధి చెప్పాలని పిలుపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవకాశవాద పొత్తులపై రాష్ట్రంలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కత్తులు నూరుతున్నారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీలతో కలిసి పోటిచేసి అధికారం చేపట్టిన ఆయన అప్పట్లో ఇచ్చిన ఏ హామీని అమలుచేయలేదని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే, ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటినీ అటకెక్కించేరన్నారు.
ఉదా.. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్‌హౌస్‌లు నిర్మిస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్‌లోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను సీట్లు కేటాయిస్తానని, మైనారిటీలకు చెందిన వక్ఫ్ ఆస్తులు, చర్చిల ఆస్తుల రికార్డులను పక్కాగా తయారుచేసి వాటిని పరిరక్షిస్తామంటూ ఆయన ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోలేదని మైనారిటీలు గుర్తుచేస్తున్నారు.నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామని, వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేస్తామని చెప్పిన మాట కూడా అమలుకు నోచుకోలేదంటున్నారు.
ఇక క్రిస్టియన్ మైనార్టీలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే.. కబ్జాదారుల నుంచి పేద క్రిస్టియన్లు, బలహీనవర్గాల భూములు కాపాడతామని, క్రైస్తవ సంస్థల ఆస్తులను పరిరక్షిస్తామని, దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని, క్రిస్టియన్ శ్మాశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామన్న హామీలను అధికారం చేపట్టిన అనంతరం పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని ఇదే చంద్రబాబు.. మళ్లీ అదే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుతో మరోసారి దగా చేసేందుకు వస్తున్నాడని, పొత్తులతో కట్టకట్టుకుని వస్తున్న ఆయనకు బుద్ధిచెప్పాలని క్రిస్టియన్, ముస్లిం నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.
బీజేపీతో కలిసి బాబు పెద్ద తప్పుచేశారు
మతతత్వ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకుని చంద్రాబాబు పెద్ద తప్పుచేశారు. 2024 ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు అనేక విష ప్రయోగాలు చేస్తున్నారు. 2014లో ఆయన బీజేపీతో పెట్టుకుని 2019లో ఆ పార్టీని వీడి ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చి మళ్లీ ఇప్పుడు ఆయన కాళ్లబేరానికి వచ్చాడు. బీజేపీ, జనసేనలతో కలిసి వస్తున్న చంద్రబాబును రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా తనదైన ముద్ర వేసుకున్న సీఎం వైఎస్ జగన్‌ను 2024 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ సీఎంను చేస్తారు.
– పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత క్రిస్టియన్ రైట్స్ చైర్మన్
ముస్లింలను అణగదొక్కిన బాబుకు బుద్ధిచెబుతాం
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ముస్లింలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత అణగదొక్కారు. మైనారిటీ శాఖను మైనారిటీలకు కాకుండా చేశారు. ఐదేళ్లపాటు ముస్లింలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని బాబు ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా ఇచ్చామనిపించారు.
బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న బాబు అదే పోకడలతో ముస్లింలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధిచెప్పడం ఖాయం.
– షేక్ మునీర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కర్వీనర్
Comments
Please login to add a commentAdd a comment