ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా దూకుడు మరింతగా పెంచారు. ఈసారి ఆయన ఏకంగా తెలుగుదేశం దుకాణం బంద్ అవుతుందని తీవ్రమైన ప్రకటనే చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ఆయన ఎద్దేవా చేసిన తీరు ప్రజలను ఆకట్టుకుందని చెప్పాలి. పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రభుత్వ స్కూల్ విద్యార్దులకు పుస్తకాలతో కూడిన స్కూల్ కిట్లు, భూట్లు, డ్రెస్‌లను పంపిణీ చేసిన జగన్ మాట్లాడిన తీరు ఆసక్తికరంగా ఉంది.
ఒకవైపు పిల్లలతో ముచ్చటించడం, విద్యారంగంలో తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించడం, ఇంకో వైపు తాను చేస్తున్న కృషిని అడ్డుకోవడానికి, ఇతరత్రా ఇబ్బంది పెట్డడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న వ్యూహాలను బహిర్గతం చేసి కౌంటర్లు విసరడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ధాటిగా మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు ఇంటికో బెంజ్ కారు ఇస్తానంటున్నారని, ప్రతి కుటుంబానికి కేజీ బంగారం ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ రకంగా చంద్రబాబు మిని మానిఫెస్టో రూపంలో జగన్‌కు మరో ఆయుధం ఇచ్చినట్లయింది. విద్యారంగానికి సంబంధించి జగన్ చేసిన కృషి ఎవరూ కాదనలేనిది. గతంలో ఎన్నడూ ఇన్ని విన్నూత్న స్కీములను ఆయన తీసుకు రాలేదు. అసలు స్కూళ్లు ప్రారంభమైన రోజునే విద్యార్దులకు కిట్లు ఇస్తున్న వైనం బహుశా జగన్ ప్రభుత్వంలోనే జరిగిందేమో! జగన్ దృష్టి అంతా పేదల పిల్లలపైనే పెడుతున్నారు. వారు సైతం బాగా చదివి ప్రపంచంతో పోటీ పడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
ఇంతవరకు విద్యారంగంలో సమూల మార్పులు చేయడానికి అరవైవేల కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించిందని ఆయన వివరించారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గతంలో పాలకులు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కో విద్యార్ధి కిట్‌కు 2400 రూపాయలు వ్యయం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పిల్లలు టోఫెల్ పరీక్షలు రాయగలిగేవారిగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతులను ఆయన పిల్లలకు, తల్లిదండ్రులకు తెలియచేశారు
నాడు-నేడు, సీబిఎస్ఇ, ఇంగ్లీష్ మీడియం వంటి మార్పులను ప్రభుత్వ స్కూళ్లలో పేదల కోసమే తెచ్చానని ఆయన చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా విద్యారంగంపై ఇంత శ్రద్ద చూపలేదన్నది వాస్తవం. అసలు ప్రభుత్వ స్కూళ్లను ఇలా బాగు చేయవచ్చని, అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం బోధించవచ్చని నిరూపించిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డులకు ఎక్కారని చెప్పాలి. ఇంతవరకు ఎవరైనా అభినందించాల్సిందే. అంతదాకా ఎందుకు . గత టరమ్‌లో పాలన చేసిన చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? కాకపోతే యూనివర్శిటీలలో రాజకీయ సదస్సులు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చేవారు.
అసలు విద్యా వ్యవస్థ అన్నది ప్రైవేటు రంగానికి సంబంధించినది అని ఆయన భావించేవారు. జగన్ అందుకు భిన్నంగా కార్పొరేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పోటీపడాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టారు. అందువల్లే విద్యార్దులలో జగన్ పట్ల క్రేజ్ ఏర్పడింది. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఈ స్కూళ్లలో సీట్లు ఖాళీ లేవన్న బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు బీజేపీ అండ ఉండకపోవచ్చని, కాని ప్రజల అండ ఉందని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఏపీ పర్యటనలో చేసిన విమర్శలకు ఆయన పరోక్షంగా సమాధానం ఇచ్చారు.
తాను బీజేపీని నమ్ముకోలేదని, ప్రజలనే నమ్ముకున్నానని ఆయన పేర్కొన్నారు. ఇతరత్రా బీజేపీ అగ్రనేతలు చేసిన ఆరోపణలను జగన్ లైట్‌గా తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే చంద్రబాబు బీజేపీతో అంటకాగడానికి తంటాలు పడుతున్న తరుణంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాను బీజేపీకి దూరం అని ప్రజలకు చెప్పగలిగారు. కొన్ని వర్గాలలో బీజేపీ అంటే ఉన్న వ్యతిరేకతను జగన్ వ్యూహాత్మకంగా కాష్ చేసుకున్నారని చెప్పవచ్చు. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ లను మాత్రం ఎక్కడ స్పేర్ చేయకుండా దంచేశారు.
వారు పేదలపై పగబట్టిన పెత్తందారులని, వారు పేద పిల్లల చదువులను సహించలేకపోతున్నారని, ఈ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని, వారి చేతుల్లో టాబ్‌లు కనిపిస్తే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని జగన్ దాడి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నది జగన్‌పై యుద్దం కాదని, పేదలపై విపక్షం చేస్తున్న యుద్దమని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. చంద్రబాబు మిని మానిఫెస్టోపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు గ్యాస్ డిక్లరేషన్ తీసుకువస్తున్నారని అన్నారు.
ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న చంద్రబాబు హామీకి జగన్ ఈ రకంగా సమాధానం ఇచ్చారన్న మాట పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని వ్యక్తి ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అంటూ మోసం చేయడానికి సిద్దం అవుతున్నారని, అప్పుడు గాడిదలు కాస్తున్నారా అని ఘాటుగా జగన్ ప్రశ్నించడం విశేషం. మరో అవకాశం ఇస్తే మయసభ నిర్మిస్తానని చంద్రబాబు అంటున్నారని, ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటున్నారని, వీటి నమ్ముతారా అని జగన్ ప్రజలను ప్రశ్నించడం ద్వారా టీడీపీ మానిఫెస్టోలోని డొల్లతనాన్ని ఆయన బయటపెడుతున్నారు. ఇదే క్రమంలో తెలుగుదేశం మూసివేతకు సిద్దమైన దుకాణం అని ఆయన కొత్త డైలాగు విసిరారు.
దీంతో జగన్ వైపు అనండి.. వైసీపీ వైపు అనండి.. రాజకీయంగా మరింత క్లారిటీ వచ్చింది. తమకు బీజేపీతో కూడా సంబంధం లేదని చెప్పడానికి ఈ అవకాశాన్ని జగన్ వాడుకోగలిగారు. తాము ఒంటరిగానే, ప్రజల అండతో ఎన్నికలలో పోటీచేస్తామని ఆయన ధీమాగా చెప్పగలుగుతున్నారు. అలాగే చంద్రబాబు మినీ మేనిఫెస్టో అంతా మోసాలమయమని, చంద్రబాబు అంటే మోసం, వెన్నుపోట్లేనని, ఇప్పుడు మరోసారి ఆయన అందుకు తయారు అవుతున్నారని జగన్ ప్రజలకు చెప్పడం ద్వారా మినీ మానిఫెస్టోని చీల్చి చెండాడారు. అది మోసఫెస్టో అని ప్రజలకు వివరించగలుగుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అటు మినీ మానిఫెస్టో విషయంలో కాని, ఇటు బీజేపీ తో పొత్తు గురించి కాని స్పష్టత ఇవ్వలేక సతమతమవుతున్నారు.
చదవండి: అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత?
ఒకరకంగా టీడీపీని ఆయనే గందరగోళంలోకి తీసుకువెళ్లారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు సహజంగానే ఆయన ఇప్పుడు చేసే ఏ వాగ్దానాలు అయినా నెగిటివ్‌గానే మారతాయి. ఆయన ట్రాక్ర్ రికార్డు ఆధారంగా వాటిని నమ్మడం కష్టం అవుతుంది. మినీ మానిఫెస్టో తర్వాత ఆయనకు కాస్తో, కూస్తో మద్దతు ఉందనుకున్న ఎగువ మధ్య తరగతి, ధనిక వర్గాలలో సైతం అసంతృప్తి ఏర్పడింది. అలాగే బీజేపీ అగ్రనేతల చుట్టూ తిరుగుతూ కాళ్లా,వేళ్లా పడుతున్నారన్న భావన బలపడడం వల్ల రాజకీయంగా మరింత నష్టం కలిగింది. జగన్ తన స్కీములను, ప్రజలను నమ్ముకుంటే, చంద్రబాబు మోసఫెస్టోని, ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియని పొత్తులపై ఆధారపడి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌ది అఫెన్స్ గేమ్ అయితే, చంద్రబాబుది డిఫెన్స్‌గా మారింది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment