సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని తెలిపారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలో వందకుపైగా స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తందని ధీమా వ్యక్తం చేశారు.
దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట జెడ్పీచైర్మన్లు, ఎంపీలు ఇంచార్జీలుగా నియమించాలని తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో ఇంచార్జీల నియామక ప్రక్రియ పూర్తికావాలని చెప్పారు.
పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. క్యాడర్‌లో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ప్రధానమన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా నడపవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ పలు తీర్మానాలను చర్చించి, ఆమోదించింది.
►‘ప్రతి రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం.
►దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా
►విదేశాలకు దేశీయ ఆహారోత్పత్తుల ఎగుమతి.
►దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు.
►దేశంలో బీసీ జనగణన జరపాలి.
దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రణాళికలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
చదవండి: పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment