సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వడం ప్రభుత్వ సామాజిక బాధ్యతని, అవసరమైతే మళ్లీ కొత్తగా ఇళ్ల జాగాల కోసం భూములు అసైన్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ భూములను అమ్ముకునే హక్కు కూడా పేదలకు కల్పించాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అసైన్‌మెంట్‌ల్యాండ్ తీసుకుంటోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
పేదల భూములను వారికే ఎస్టాబ్లిష్ చేసి రీ అసైన్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పేదల భూములను కాపాడతామని భరోసానిచ్చారు. అసైన్‌మెంట్ భూములపై పార్టీలకు అతీతంగా దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామన్నారు. ఇలాంటి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవో ఇచి్చందని, దానికి తగ్గట్టుగానే తెలంగాణలో కూడా పరిశీలిద్దామని సీఎం చెప్పారు.
వ్యవసాయ భూముల అమ్మకానికి అనుమతించకపోయినా పట్టణప్రాంతాల్లో విక్రయానికి అనుమతిస్తే దళితులు ఇతర చోట్ల భూమి కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. అందరూ సరేనంటూ రాబోయే ఐదారు రోజుల్లోనే ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ మేరకు జీవో కూడా విడుదల చేసేందుకు తనకు అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
గొంతెమ్మ కోర్కెలు సరికాదు
కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, భద్రాచలంకు చెందిన ఐదు గ్రామాలను కేంద్రంతో మాట్లాడి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే స్వీపర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో పాటు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ సఫాయన్నా నీకు సలామన్న అని గతంలోనే గ్రామపారిశుధ్యకార్మికుల వేతనాలు పెంచామని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగానూ రూ.వెయ్యి పెంచామని గుర్తు చేశారు అలాంటిది కొందరు గొంతెమ్మ కోర్కెలు కోరడం సరికాదని వ్యాఖ్యానించారు.
గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఒక విధానం తీసుకొచ్చేందుకు భవిష్యత్‌లో ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. ఆసరా పింఛన్ల విషయంలో భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే వెంటనే మరొకరికి త్వరలో పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని, పాల రైతులకు బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment