కోల్‌కతా: ఆర్‌జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రజలు, వైద్యులు, న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఆ డిమాండ్‌పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీదీకి మద్దతుగా నిలుస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘ బీజేపీ నేతలు ముఖ్య మంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరిగాయి. కానీ పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రశ్నించారు. బీజేపీదీ పితృస్వామ్య పాలన ఇలాగే ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ పన్నాగం పన్నాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న అనుమానితులు కాల్పులు జరిపేందుకు కుట్రపన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయమంటే చేస్తారా? అని భట్టాచార్య ప్రశ్నించారు. రాబందు రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుంది’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ స్పందించింది. ర్యాలీలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనలకు హాజరైతే, అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment