సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక
గంటకో డ్రెస్ మార్చే మోదీ కావాలా? ప్రజల కోసం
తిరుగుతున్న రాహుల్ గాంధీ కావాలా? తేల్చుకోవాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కాలు విరిగిందని, అధికారం పోయిందని, కూతురు జైలుకెళ్లిందని ఇన్నాళ్లూ సంయమనం పాటించామని.. సైలెంట్‌గా ఉన్నామని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తాను జానారెడ్డి టైపు కాదని.. తప్పుడు మాటలు మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు. గతంలోనే తాను చెప్పినట్టు కేసీఆర్, కూతురు, అల్లుడు, కుటుంబం ఉండేట్టు అందులో డబుల్ బెడ్రూం కట్టిస్తానని వ్యాఖ్యానించారు.
శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీపై, ఆ పార్టీల నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..‘‘ఇన్నాళ్లూ కుక్కలు మొరిగినయ్. ఇప్పుడో నక్క వచ్చింది. మొన్న సూర్యాపేటకు, నిన్న కరీంనగర్‌కు వెళ్లింది. కేసీఆర్ తననేం పీకుతారని అడుగుతున్నారు. వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. అది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? పదేళ్లుగా రాష్ట్రాన్ని పీడించి, దోచుకున్న దొంగలు వాళ్లు.
ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం..
గత ఏడాది సెప్టెంబర్ 17న సోనియాగాంధీ ఇదే చోట సభలో ఆరు గ్యారంటీలిచ్చి తెలంగాణలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా దేశానికి ఐదు గ్యారంటీలను రాహుల్‌గాంధీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుంది. జూన్ 9న ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా తొక్కారో.. అదే ఊపు, ఉత్సాహం, పట్టుద లతో బీజేపీని తొక్కడానికి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభకు వచ్చారు. వైబ్రెంట్ తెలంగాణ నినాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తాం.
మా పాలనను మీ ముందు పెట్టాం
మా 100 రోజుల పాలనను మీ ముందు పెట్టాం. మేం మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమ లు చేస్తే, ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించామని అనుకుంటే మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు, అనుమతులు తెచ్చుకోవాలన్నా తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలు గెలవాలి.
మోదీ.. గాంధీ కుటుంబం మధ్య పోరాటం..
విదేశాలు తిరుగుతూ గంటకో డ్రెస్ మార్చే మోదీ దేశ ప్రధాని కావాలో.. దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి చుట్టివస్తున్న రాహుల్ గాంధీ కావాలో తేల్చుకోవాలి. రాబోయేవి ఎన్నికలు కావు. పోరాటం. నరేంద్ర మోదీ కుటుంబం, గాంధీ కు టుంబం మధ్య పోరాటం. మోదీ కుటుంబంలో ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐ ఉన్నాయి. గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీతోపా టు ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, దేశంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు.
నమో అంటే నమ్మితే మోసం..
రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ప్రయత్నా లను ఆపాలంటే తెలంగాణ రాహుల్ గాంధీ వెంట నడవాలి. అసలు బీజేపీకి ఎందుకు ఓటే యాలి? ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసినందుకా? రైతులను చంపినందుకా? దేశంలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టినందుకా? హైదరాబాద్‌లో వరదలు వస్తే ఈ సిగ్గులేని కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా వరద సాయం తెచ్చారా? నమో అంటే నమ్మితే మోసం. 2024 నాటికి ప్రతిపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని మోదీ చెప్పారు. మరి తెలంగాణలో ఎన్ని ఇళ్లు ఇచ్చా రో బీజేపీ నేతలు లెక్కచెప్పి ఓట్లడగాలి..’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment