ఆరు గ్యారంటీలకు ‘రేషన్‌ కార్డు’ మస్ట్‌: సీఎం రేవంత్‌ | CM Revanth Released Congress 6 Guarantees Praja Palana Application Form In Hyderabad - Sakshi
Sakshi News home page

Praja Palana Application Form: తెలంగాణ: ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది.. ‘ప్రజాపాలన’ ఆరు గ్యారంటీలకు ఫామ్‌ రిలీజ్‌

Published Wed, Dec 27 2023 1:22 PM | Last Updated on Wed, Dec 27 2023 2:20 PM

CM Revanth Released Congress Six Guarantees Form in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత పదేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో ప్రజావాణి చూస్తే అర్థమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి విడుదల చేశారాయన. ప్రజా పాలన పేరిట విడుదల చేసిన ఈ దరఖాస్తు ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పారాయన. 

ఆరు గ్యారంటీల దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు. లోగోను కూడా ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు  ఈ ఒకే దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగుటలేటి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్‌ శాంత కుమారి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ప్రజలకు పదేళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదు. ప్రజావాణికి వస్తున్న స్పందనే ఆ విషయం చెబుతోంది. ప్రజావాణిలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకెళ్లమే ప్రజా పాలన ఉద్దేశం. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తాం. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది అని ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్‌ చెప్పారు.

ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తాం. మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తాం. మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.

ఒక గ్రూపునకు ఎండీఓ, మరో గ్రూప్‌నకు ఎంఆర్‌వో బాధ్యత వహిస్తారు. ఎవరి కోసం ఎదురు చూడకండి.. ఎవరి దగ్గరకు వెళ్లకండి. అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులో ఉంటారు. జనవరి ఆరో తేదీ తర్వాత కూడా ఎంపీడీవో, ఎంఆర్‌వో ఆఫీసుల్లో అభయ హస్తం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే రేషన్‌కార్డులు ఇస్తాం. రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. పదేళ్ల గడీల నుంచి పాలన గ్రామాలకు తీసుకువస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల దగ్గరకు పాలనను పంపిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement