28 నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం | CM YS Jagan Election campaign From 28th April 2024 | Sakshi
Sakshi News home page

28 నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

Published Fri, Apr 26 2024 5:17 AM | Last Updated on Sat, Apr 27 2024 12:11 AM

CM YS Jagan Election campaign From 28th April 2024

తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు

రేపు వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

కూటమి కూసాలు కదిలించేసిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. 

ఈనెల 28న (ఆదివారం) ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు అంటే 27న (శనివారం) వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

కదన కవాతు..
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి. ఒకదానిని మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచిపోయాయి. 

ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీ. మేర సాగిన బస్సు యాత్ర పొడవునా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకూ సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. 

బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 బహిరంగ సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం తరలి వచ్చారు. దేశ రాజకీయ చరిత్రలో సీఎం జగన్‌ బస్సు యాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు జనసేన, బీజేపీలతో జతకట్టినా ప్రజల స్పందన కరువైంది. 

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన సీఎం జగన్‌ బస్సు యాత్రతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదనోత్సాహంతో దూసుకెళ్తుంటే కూటమి శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురవుతున్నాయి.

మంచిని వివరిస్తూ.. మోసాలను ఎండగడుతూ
ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన సీఎం  జగన్‌ ప్రజల్లో విశ్వ­సనీయతను చాటుకున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో  సుపరి­పాలన అందిస్తున్నారు.  డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్ల­ను జమ చేశారు. 

నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో ఈ స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూర్చిన దాఖలాల్లేవు.  విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిపథాన నిలి­పారు. ఇదే అంశాన్ని సిద్ధం సభల్లో, బస్సు యాత్రలో సీఎం జగన్‌ ప్రజలకు వివరించారు. 

విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టు కట్టి 650కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను  వంచించటాన్ని, నాటి అరాచ­కాలను ప్రజలకు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని,  అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.  తాజాగా విడుదల చేయనున్న మేనిఫెస్టోను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement