YSRCP Manifesto: మేనిఫెస్టో ఎలా ఉండనుందంటే.. | AP Elections 2024: YSRCP Manifesto Likely To Be CM Jagan's Mark | Sakshi
Sakshi News home page

నవరత్నాలను మించేలా.. ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో!?

Published Mon, Mar 18 2024 9:16 AM | Last Updated on Mon, Mar 18 2024 10:51 AM

AP Elections 2024: YSRCP Manifesto Likely To Be CM Jagan's Mark - Sakshi

సాక్షి, గుంటూరు: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఓ పక్క అభ్యర్థుల ప్రకటన తర్వాత ఓ అడుగు ముందేసి నేడో రేపో అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి దిగబోతోంది. మరోవైపు ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటులోనే ఇంకా తలమునకలై ఉంది. ఈ తరుణంలో.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపైనే  సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసేసిన వైఎస్సార్‌సీపీ.. ఇప్పుడు ఈ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదలకు సిద్ధం అయ్యింది. అతిత్వరలోనే ఈ ప్రకటన ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మేనిఫెస్టో రూపకల్పన ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తొలుత  సిద్ధం సభల వేదికగా ప్రకటన ఉంటుందని భావించినా.. ఆ తర్వాత సీఎం జగన్‌ ప్రచార సభల నుంచి వెలువడొచ్చని ప్రచారం జరిగింది. అయితే.. పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగానే మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తాజా సమాచారం. 

2024లో మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది..?. గ‌త ఎన్నిక‌ల ముందు న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌పై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు.. న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో త‌న చిత్త‌శుద్ధిని చాటుకున్నారు. దీంతో.. ఈసారి నవరత్నాలకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా కూడా  రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోంది.

నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా.. ఇప్పటికే సంక్షేమ విషయంలో దేశంలోనే ఏ రాష్ట్రం కూడా అమలు చేయని పలు పథకాలు ఉన్నాయి. దీంతో ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలతో మేనిఫెస్టో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. మౌలిక సదుపాయాల కల్పన హామీలు కూడా చేర్చే అవకాశాలున్నాయని సమాచారం.

గ‌తంలో కంటే ప్రతి విష‌యంలోనూ అధిక ల‌బ్ధి క‌లిగించేలా మేనిఫెస్టో వుంటుంద‌ని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మల్లే మాత్రం వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉండబోదని హామీ ఇస్తున్నారు. అలాగే.. తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ కావడం ఖాయమని అంటున్నారు.

ఇక.. హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వరస్ట్ ట్రాక్ రికార్డుంది. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలా కాదు. అధికారం చేపట్టాక 2019 మేనిఫెస్టోలోని 99.5% హామీలు అమలు చేశారాయన. దీంతో.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం జనాల్లో బాగా పేరుకుపోయింది. అందుకే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో  అంతగా ఆసక్తి ఏర్పడింది. 

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అంటే.. ఎన్నికల జిమ్మిక్కు కాదు. ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేసేలా ఉండదు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అంటే నిబద్ధత. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌.. అంతటి పవిత్రమైంది. మాట తప్పని మడమ తిప్పని తమ అధినేత వైఎస్‌ జగన్‌ ఇచ్చే హామీలు. అన్నింటికి మించి.. ఏపీ ప్రజల కోసం తమ ముందున్న కర్తవ్యం అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement