
స్కిల్ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం? అని టీడీపీ అభిమాన మేధావులు ప్రశ్నిస్తున్నారు. సీఎం హోదాలో ఉండే వ్యక్తి సవాలక్ష నిర్ణయాలు తీసుకున్నా వాటికి అధికారులదే బాధ్యత తప్ప సీఎంది కానే కాదని వారు కన్వెనియంట్ లాజిక్కు లాగుతున్నారు. పోనీ వాళ్ల వితండ వాదనే కరెక్ట్ అని కాసేపు ఒప్పుకున్నా.. 2018లోనే జీఎస్‌టీ అధికారులు ఈ కుంభకోణం గురించి చంద్రబాబు ప్రభుత్వానికి ఉప్పందించినా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటున్నారు నిపుణులు.
13చోట్ల బాబు సంతకం
లేని సిమన్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. జీవోలో మూడు వేల మూడు వందల కోట్లు చెప్పి ఒప్పందంలో ఆ లెక్క మాయం చేశారు. సిమన్స్ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తుందని బుకాయించిన వారు.. సిమన్స్‌తో ఒప్పందం చేసుకున్నామని చెప్పి డిజైన్ టెక్ కంపెనీకి 371 కోట్లు ఉదారంగా చదివించుకున్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 13 చోట్ల సంతకాలు చేశారు.
అప్పటి ఐఏఎస్ అధికారులు ఈ ఒప్పందం.. ముందస్తుగా ప్రభుత్వమే 371 కోట్లు విడుదల చేయడం చట్ట విరుద్ధం.. అక్రమం అని హెచ్చరించినా చంద్రబాబు నాయుడి ఒత్తిడి మేరకే నిధులు విడుదల చేయాల్సి వచ్చిందని అధికారులు నోట్ ఫైల్స్‌లోనే చక్కటి దస్తూరీతో పేర్కొన్నారు. చంద్రబాబు తప్పించుకోలేని విధంగా ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపాయి.
కణ్వ మహర్షిని అరెస్ట్ చేసినట్లు నానా యాగీ
చంద్రబాబును అరెస్ట్ చేయడంతోనే టీడీపీ నేతలు అనుకూల మేథావులు పెడబొబ్బలు పెట్టేస్తున్నారు. అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే కణ్వ మహర్షిని అరెస్ట్ చేసినట్లు నానా యాగీ చేస్తున్నారు. గతంలో కుంభకోణాలను ఉద్దేశించి ఆర్ధిక ఉగ్రవాదం మహా ప్రమాదకరం అని వ్యాఖ్యానించిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు ఇపుడు చంద్రబాబు కేసులో ముఖ్యమంత్రికి సవాలక్ష పనులు ఉంటాయి. ఏ ఫైలులో ఏ నిధులు ఎవరికి కేటాయించారో అవి ఎక్కడికి పోయాయో ఆయన ఎలా తెలుసుకుంటారు? అంచేత స్కిల్ స్కాంలో అధికారులను బాధ్యులను చేయాలే తప్ప ముఖ్యమంత్రిని కాదన్నారు.
చదవండి: ‘టీడీపీ నేతలు మర్చిపోయారా?.. కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా?’
పప్పులో కాలేసిన మేధావులు
టీడీపీ నేతలూ అంతే.. చంద్రబాబుకు ఈ కుంభకోణంతో సంబంధం ఏంటి? అప్పటి అధికారులను వదిలేసి బాబును అరెస్ట్ చేయడం ఏంటి? అని చాలా గడుసుగా అడుగుతున్నారు. ఇక్కడే ఈ మేధావులంతా పప్పులో కాలేశారు. వారు వాదించినట్లే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడికి స్కాంతో సంబంధం లేదనుకుందాం. అధికారులే చంద్రబాబు కళ్లు కప్పి 371 కోట్లు విడుదల చేసేసి అక్కడి నుంచి డొల్ల కంపెనీలకు పంపించేశారనుకుందాం.
చంద్రబాబు ఇంటికి ఎందుకు పంపినట్లు?
ఆ డొల్ల కంపెనీల నుండి 241కోట్ల రూపాయలు హవాలా దారిలో చంద్రబాబు సీఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌లకు వెళ్లాయని అక్కడి నుంచి అవి చంద్రబాబు ఇంటికి వెళ్లాయని ఈడీ నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబు కళ్లు కప్పి కోట్లు కాజేసిన అధికారులు వాటిని చంద్రబాబు ఇంటికి ఎందుకు పంపినట్లు? అలా పంపడం కూడా బాబు కళ్లు కప్పి చంద్రబాబు ఇంట్లో పెట్టేశారా?
ఇక మరో ప్రశ్న. స్కాం గురించి బాబుకు తెలీదనే అనుకుందాం. ఆయన నమ్మి బాధ్యతలు అప్పగించిన అధికారులే స్కాం చేశారనుకుందాం. అందుకే బాబుకు దీని గురించి తెలీదనుకుందాం. మరి 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే పూణే నుంచి జీఎస్టీ అధికారులు ఏపీ ప్రభుత్వానికి ఓ సమాచారం అందించారు. మీ రాష్ట్రంలో స్కిల్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు చెందిన కోట్లకు కోట్లను షెల్ కంపెనీలతో తరలించేశారు.
ఎందుకు అలా చేయలేదు!
మీరు నిఘా పెట్టి దోషులపై చర్యలు తీసుకోండని జీఎస్టీ అధికారులు ఉప్పందించారు. చంద్రబాబు అప్పటి దాకా నిజంగానే అమాయకుడు అయి ఉంటే.. ఆ సమాచారం అందిన తర్వాత అయినా దీనిపై ప్రభుత్వ పరంగా దర్యాప్తుకు ఆదేశించి ఉండాలి. సంబంధిత ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకుని ఉండాలి. మరి చంద్రబాబు అలాంటివేవీ ఎందుకు చేయలేదు? వీటికి మేథావులు సమాధానం చెప్పాలంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.
జీఎస్టీ అధికారుల సమాచారం అందిన వెంటనే ఏపీ ఏసీబీ అధికారులు చంద్రబాబు నాయుడికి ఆ సమాచారం అందించగానే చంద్రబాబు అసలే చర్యలు తీసుకోలేదని కాదు. తీసుకున్నారు. అదేంటంటే ఫేక్ సిమన్స్ కంపెనీతో చేసుకున్న డొల్ల డీల్‌కు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తగల బెట్టించేశారు. అయితే ఎంత పెద్ద గజ దొంగ అయినా ఏదో చిన్న క్లూ విడిచి పెట్టి వెళతాడన్నట్లు.. సచివాలయంలోని షాడో ఫైల్స్ బాబు బండారాన్ని బట్టబయలు చేశాయి. అవే చంద్రబాబును బోనులో నిలబెట్టి జైలుకు పంపాయి. జరిగింది ఇదయితే టీడీపీ నేతలు వారి అనుకూల మేథావులు అడ్డగోలుగా గగ్గోలు పెడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.
-CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment