సాక్షి, ముంబై: గత ఏడున్నర సంవత్సరాలుగా థానే జిల్లా ఇంచార్జి మంత్రిగా కొనసాగిన ఏక్‌నాథ్ శిండే ఇటీవల ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాని జిల్లా ఇంచార్జి మంత్రి పదవి తమ ఆధీనంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది. అంతేగాకుండా ఇప్పటి నుంచే బీజేపీకి చెందిన పలువురు పైరవీలు చేయడం ప్రారంభించారు. ఇందులో బీజేపీకి చెందిన రవీంద్ర చవాన్, గణేశ్ నాయిక్ పేర్లు ఆగ్రస్ధానంలో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేకు సన్నిహితులుగా ఉన్న ప్రతాప్ సర్నాయిక్, బాలాజీ కిణీకర్ పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. వీరితోపాటు ఆ పదవి దక్కించుకునేందుకు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ పోస్టుపై పోటాపోటీ...
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శిందేకు మద్దతిచ్చిన వారిలో థానే జిల్లాకు చెందిన నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో జిల్లా వాటాలోకి వచ్చిన రెండింటిలో ఒక కేబినెట్ మంత్రి పదవి తమకు దక్కాలని ఈ ఎమ్మెల్యేలు ఆసక్తితో ఉన్నారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. మంత్రి పదవి కోసం బీజేపీకి చెందిన గణేశ్ నాయిక్, రవీంద్ర చవాన్, కిసన్ కథోరే అలాగే షిండే వర్గానికి చెందిన ప్రతాప్ సర్నాయిక్, బాలాజీ కిణీకర్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా థాణే జిల్లా ఏక్‌నాథ్ షిండేకు కంచుకోటగా ఉంది. ఇక్కడ తిరుగులేని నాయకుడిగా ఆయన ఎదిగారు. దీంతో థానే జిల్లాలో షిండే వర్గం ప్రాతినిథ్యం వహించాలని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రతాప్ సర్నాయిక్‌కు ఈ పదవి వరించే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్
ప్రతాప్‌తోపాటు ఎమ్మెల్యే బాలాజీ కిణీకర్ పేరు కూడా అగ్రస్ధానంలో ఉంది. ముఖ్యంగా కిణీకర్ దళితుడు కావడంతో మంత్రిమండలిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం కూడా ఉంది. దీంతో బీజేపీ వర్గయుల్లో కొంత అసంతృప్తి వాతావరణం కనిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీ ఆధీనంలో ఉన్న థానే జిల్లా ఇప్పుడు మళ్లీ చేజిక్కించుకునేందుకు ఇదే మంచి అవకాశమని స్ధానిక బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. అందుకు ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్, నిరంజన్ డావ్‌ఖరే, గణేశ్ నాయిక్ లేదా కిసన్ కథోరేలను మంత్రిమండలిలో చేర్చుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క జిల్లా ఇంచార్జి మంత్రి పదవి బీజేపీకి దక్కాలని, ఆ పదవి కోసం రవీంద్ర చవాన్, గణేశ్ నాయిక్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. బీజేపీకి చెందిన గణేశ్ నాయిక్‌కు మంచి అనుభవం ఉంది. ఎన్సీపీకి గుడ్‌బై చెప్పి ఆయన బీజేపీలో చేరారు.
అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని కూడా కేబినెట్‌లో మంత్రిని చేసే అవకాశముంది. అలాగే రవీంద్ర చవాన్ ఫడ్నవీస్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. అంతేగాకుండా ఫడ్నవీస్‌కు చాలా దగ్గరి సన్నిహితుడని పేరుంది. కొంకణ్ రీజియన్‌లో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో చవాన్‌కు కూడా కేబినెట్‌లో మంత్రి పదవి కట్టబెట్టి థానే జిల్లా ఇంచార్జి మంత్రిని చేసే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment