ఆ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారట కానీ ఎవరిని బరిలోకి దించాలో తెలియక కిందామీదా పడుతున్నారట. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జికే సీటివ్వాల.. లేక బయటి నుంచి ఎవరినైనా తెచ్చి పోటీ పెట్టాలో తేల్చుకోలేకపోతున్నారట. అందుకే మీ ఓటు ఎవరికి వేస్తారంటూ రోజుకొకరి పేరుతో సర్వే చేయిస్తున్నారట చంద్రబాబు. కాని.. ప్రజలు టీడీపీలో ఎవరికీ అనుకూలంగా లేకపోవడంతో పచ్చ బాస్ తలపట్టుకున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, అక్కడి పరిస్థితి ఎలా ఉంది?
తొలి విడత సీట్లను ప్రకటించేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబుకు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదట. వాస్తవానికి సామాజికవర్గం పరంగా, పార్టీ పరంగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో ఈసారి ఎలాగైనా పెనమలూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గన్నవరం, గుడివాడతో పాటు పెనమలూరు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ...పెనమలూరులో వైసీపీని ఢీకొట్టే అభ్యర్ధి మాత్రం చంద్రబాబుకు దొరకడం లేదని టాక్. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకే టిక్కెట్ అని ఆయన ఆశపడుతున్నారు.
కానీ పెనమలూరు విషయంలో చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బోడే కాకుండా గట్టి అభ్యర్ధిని బరిలోకి దించాలని రకరకాల ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారట. ఇటీవల టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ తో పాటు దేవినేని ఉమా పేరు మొన్నటి వరకూ పెనమలూరులో బలంగా వినిపించాయట. కానీ వసంతకు మైలవరం దాదాపు ఖాయమైపోవడంతో ఉమా అయితే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఓ సర్వే చేయించారట.
పెనమలూరు అభ్యర్ధిగా ఉమా మీకు కావాలంటే ఓటేయండంటూ ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా సర్వేలో కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు సేకరించారట. ఈ సర్వేలో ఉమాకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎం.ఎస్.బేగ్ పేరుతో మరో సర్వే చేయించారట. దీనిలోనూ పెద్దగా అనుకూలత రాలేదట. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్.. కొలుసు పార్ధసారధి ద్వారా పెనమలూరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ఇలా రోజుకో పేరుతో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న సమయంలో మాకేం తక్కువ అని నిలదీస్తున్నారట పెనమలూరు లోకల్ తెలుగు తమ్ముళ్లు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరెవరి పేరుతోనే సర్వేలు చేయించడమేంటని మండిపడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో అభ్యర్ధుల్ని తెచ్చి బలవంతంగా తమపై రుద్దే బదులు ఆ టిక్కెట్ ఏదో తమకే ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారట. ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయించిన తరుణంలో మైనార్టీ కోటాలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట
టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్. మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు ప్రకటిస్తారని అంతా ఆశించారు. అలా జరిగేలా లేదని తేలిపోవడంతో బోడేకు టిక్కెట్ ఇవ్వకపోతే మైనార్టీ అభ్యర్ధిగా తనకే కేటాయించాలి కానీ వలస వచ్చే వారికి ఇస్తే మాత్రం సహకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారట.
పెనమలూరు టిక్కెట్ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి మాని త్వరగా తేల్చేయాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరులో జెండా పాతడం ఎలా అంటూ చంద్రబాబు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇదే విధంగా జాగు చేస్తే..అంతా కలిసి టీడీపీ జెండా పీకేసేలా ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందట.
ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం!
Comments
Please login to add a commentAdd a comment