సీఎం ఏక్‍నాథ్ షిండే దెబ్బతో మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన మహా వికాస్ అఘాడీ(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, పీడబ్యూపీఐ)కి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. మొన్నటివరకు మిత్రపక్షాలు శివసేన, ఎన్సీపీతో అధికారాన్ని పంచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు షిండే సీఎం అయ్యాక మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మహావికాస్ అఘాడీ కూటమి నుంచి హస్తం పార్టీ బయటకు రావాలనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే బలం నిరూపించుకున్న కొద్ది సేపటికే కాంగ్రెస్ ఎంవీఏ కూటమి నుంచి వైదొలగాలనుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిత్రపక్షం బీజేపీ తెగదెంపులు చేసుకుంది శివసేన. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే .. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఠాక్రేకు ఏక్‌నాథ్ షిండే షాక్ ఇచ్చారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గతవారమే సీఎంగా బాధ్యతలు చెప్పారు.సోమవారం జరిగిన బలపరీక్షలో నెగ్గారు. బీజేపీ మద్దతున్న షిండేకు 164 ఓట్లు రాగా.. మహావికాస్ అఘాడీకి 99 ఓట్లే వచ్చాయి.
మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ విడిపోతుందనే వార్తలు బయటకు రాగానే.. బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధె ఈ విషయంపై స్పందించారు. ఎంవీఏపై విమర్శలతో విరుచుకుపడ్డారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కేవలం అధికార దాహంతోనే ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడం వల్ల కూటమిలోని పార్టీలు ఆలోచనలో పడ్డాయని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం షిండే బలం నిరూపించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. సీఎం ఏక్‌నాథ్ షిండేకు అభినందనలు చెప్పారు. షిండే నిజమైన శివ సైనికుడని, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే అసలైన శిష్యుడని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment