సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌పై బీజేపీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈనెల 15న ముగియనుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు ఆజాద్ సేవలను కొనియాడారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన మార్కును చూపించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజా సేవకోసమే పరితమించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్‌దాస్ అంథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనపై పట్టు కలిగిన ఆజాద్ లాంటి సభ్యులు చట్ట సభల్లో ఉండటం చాలా అవసరమన్నారు. మరో వారంరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తోందని, మరోసారి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆజాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. తాము (ఎన్డీయే) నామినేట్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి నేతలు సభలో ఉండటం పార్లమెంట్‌కు గర్వకారణమన్నారు. ఆజాద్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ.. రాజ్యసభలో విపక్ష నేతగా ఆజాద్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తీవ్రమైన ఉద్వేగానికి గురై కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయారు.
కాగా తొలిసారి 1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆజాద్ సుమారు 40 ఏళ్లకు పైగా ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. 2005లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్నికై 2008 వరకు కొనసాగారు. ఆ తరువాత యూపీయే (2009-2014) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారు. అయితే 71 ఏళ్ల ఆజాద్‌ను మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయడంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఇప్పట్లో ఆయన ఎన్నికైయ్యే అవకాశం కూడా లేదు. దీంతో ఇదే ఆయనకు చివరి అవకాశంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాము నామినేట్ చేస్తామంటూ అథవాలే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment