ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ మూడు జనరల్ స్థానాలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మూడు చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి యాక్షన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఖమ్మంకు లెక్క కుదిరింది. ఇక వారికి కావాల్సింది కొత్తగూడెం, పాలేరులోనే.. దీంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లోని కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకునేందుకు చర్చలు మొదలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంతకీ ఎవరు ఆ నేతలు.. చర్చలు ఎంత వరకు వచ్చాయి. కాంగ్రెస్ గురిపెట్టిన ఆ మూడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాలు టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మొదలు పెట్టింది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు నియోజకర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దింపడం దాదాపు ఖారారు అయినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన రెండు నియోజకవర్గాలైన పాలేరు, కొత్తగూడెంలో ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నా.. ఇంకా బలమైన అభ్యర్థుల కోసం వేచి చూస్తోంది.
దీనిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్ ఇస్తామని హమీ ఇస్తున్నారు. మరోవైపు తుమ్మల సైతం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు.
అటు బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ కందాలకు టికెట్ ఇస్తే అప్పుడు తుమ్మల పార్టీలో ఉంటారా లేక ఆప్షన్ ఇస్తున్న కాంగ్రెస్‌లో జంప్ అవుతారా అన్నది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుమ్మల మాత్రం పార్టీ మారే ఆలోచనలో లేకపోయిన అనుచరుల ఒత్తిడి ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్న టాక్ సైతం లోకల్‌గా వినిపిస్తుంది.
మరోవైపు కొత్తగూడెం జనరల్ స్థానంలో సైతం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. పార్టీలోకి వస్తే కొత్తగూడెం టికెట్ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు జలగంతో సంప్రందిపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో జలగం చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే జలగం పార్టీ మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. అటు బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం జలగంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అదే విషయంపై జలగంకు సైతం ఇటివలే ఒక క్లారిటీ వచ్చిందన్న ప్రచారం ఉంది. దీంతో జలగం ఏ సమయంలోనైన హస్తం గూటికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌లో అయోమయ పరిస్థితి!
కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లు జరిగితే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఖమ్మం రాజకీయాలు మాత్రం హట్ హట్‌గా మారుతున్నాయనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment