సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. మరోసారి గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని అధికార టీఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతుండగా.. తమ ప్రభావం చూపించాలని కమలదళం కసితో ఉంది. ఇరు పార్టీలు విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల విషయంలో ఆచితూచీ వ్యవహరించిన అధికార, విపక్షం.. చివరి వరకూ ఎదురుచూసి అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇతర పార్టీలకు చెందిన అసమ్మతి నేతలను చేర్చుకుని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నాయి. (టీఆర్‌ఎస్ డివిజన్ ఇన్‌చార్జీల జాబితా ఇదే!)
మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవడం, ప్రచారం సంగతి అలాఉంచితే.. పార్టీలో ఉన్న నేతల్ని కాపాడుకోవడం నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న 100 ఏళ్ల చరిత్రగల పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. టికెట్ పంపకాల విషయంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. (రాజధానిలో వేడెక్కిన రాజకీయం)
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీఫారంల పంచాయతీ తారాస్థాయికి చేరకోవడంతో టీపీసీసీకి రాజీనామాల బెదిరింపులు వరుస కడుతున్నాయి. గోశామహల్ నియోజకవర్గంలో తాను టికెట్ ఇచ్చినవారికి బీఫారం ఇవ్వకపోతే... రాజీనామా చేస్తానంటున్న ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ బెదిరింపులకు దిగారు. తన వర్గం నేతలకు సీటు కేటాయించి తీరాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కేంద్రమాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత సర్వే సత్యనారాయణ సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నేతైన తనకు ఏమాత్రం గౌరవం దక్కడంలేదని, టీపీసీసీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీని వీడుతున్నట్లు ఇదివరకే ప్రకటించారని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇక చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన బీజేపీ పెద్దలను సైతం కలిశారని, చేరికకు లైన్‌క్లీయర్ అయ్యిందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన విశ్వేశ్వరరెడ్డి.. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోనూ తనకు మంచి స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని, ఆ పరిచయంతోనే వారితో కలుస్తున్నాని వివరణ ఇచ్చారు. తను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని ట్విటర్ పోస్ట్ ద్వారా కొట్టిపారేశారు.
I just heard a rumour.... I am joining BJP.
— Konda Vishweshwar Reddy (@KVishReddy) November 20, 2020
Yes it is a just a rumour. I have lot of friends and aquaintances in all parties inuding TRS, MIM and BJP.
Comments
Please login to add a commentAdd a comment