సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరికలు జోరుగా సాగగా, నామినేషన్ల పర్వం ముగిశాక కూడా అవి కొనసాగుతున్నాయి. తాజాగా ఒకరు టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతే.. మరొకరు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరి ప్రభావం ఎంత? ఎవరి ద్వారా ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేయడం, కర్నె ప్రభాకర్ పార్టీని వీడతారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది.
టీఆర్‌ఎస్‌లో చేరిన పల్లె రవి దంపతులు
బూర నర్సయ్యగౌడ్ టీఆర్‌ఎస్‌కు రాజీనామ చేయడంతో అప్రమత్తమైన పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వెళతారన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్య నేతలు ఆయన్ని తమ దగ్గరకు పిలుచుకున్నారు. మరోవైపు బూర నర్సయ్యగౌడ్ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె రవికుమార్, ఆయన భార్య చండూరు ఎంపీపీ పల్లె కల్యాణిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. వారు శనివారం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీరామరావు సమక్షంలో పార్టీలో చేరారు. నియోజకవర్గంలో ఉన్న 37,891 గౌడ సామాజిక వర్గం ఓట్లను నష్టపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
టీఆర్‌ఎస్‌ను వీడిన బూర నర్సయ్యగౌడ్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున టికెట్ ఆశించిన భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శనివారం ఆ పార్టీని వీడారు. అయితే మునుగోడు టికెట్‌ను ఆయనతోపాటు చాలా మంది ఆశించారు. వారిలో ఆయనొక్కరే పార్టీని వీడగా, మిగతా వారు పార్టీలోనే ఉన్నారు. ఆయన కూడా ఈనెల 13న టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరుసటి రోజు «ఢిల్లీకి వెళ్లడంతో ఆయన బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం సాగింది.
కాగా, శనివారం టీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. నేడో రేపో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు టికెట్ ఇవ్వాలని, అడిగితే తప్పేంటని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. పైగా మంత్రి జగదీశ్‌రెడ్డి తమను పట్టించుకోవడం లేదని, కార్యక్రమాలకు పిలువడం లేదని విమర్శలు గుప్పించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఎన్నో అవమానాలకు గురయ్యామని, ఆ విషయంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు తెలిసినా మౌనంగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment