సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమీక్ష జరిపారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమావేశంలో సోనియా చెప్పారు. సోనియా నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా, పార్టీని బలోపేతం చేసేలా తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆమెను కోరింది.
రాహుల్ పార్టీ నాయకత్వం వహించాలన్నది ప్రతిఒక్క కార్యకర్త కోరికని, అయితే సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నందున వీటిలోనే కొత్త అధ్యక్షుడిని నిర్ణయిస్తామని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామని, పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ శిబిరాన్ని రాజస్థాన్‌లో నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సీడబ్ల్యూసీ ముందు ప్రస్తావించగా, వారి ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఫలితాలు తీవ్ర ఆందోళనకరం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలపై సీడబ్ల్యూసీ చర్చించిందని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు సూచనలు చేశారని సూర్జేవాలా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి ‘తీవ్ర ఆందోళన కలిగించేవి’లా ఉన్నాయన్న అంశాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. కాంగ్రెస్ తన వ్యూహంలో లోపాల కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోయినట్లు అంగీకరించారు. వీటితో పాటు పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించలేకపోయిందని, పార్టీ అంతర్గత కలహాలు కొంప ముంచాయని సీడబ్ల్యూసీ అంగీకరించింది. అదే సమయంలో శక్తివంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని ప్రజలకు హామీ ఇచ్చింది.
ఈ ఏడాదితో పాటు, 2023, 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధమవుతుందని సీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, హరీష్ రావత్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా కారణంగా ఏకే ఆంటోని హాజరుకాలేదు.
మీరే దిక్కు
పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసే మార్గాలపై రాహుల్ సూచనలిచ్చారన్నారు. పార్టీ ఓటమికి కారణాలను సభ్యులు విశ్లేషించినట్లు తెలిపారు. సమావేశానికి జీ 23 కూటమికి చెందిన ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే హాజరయ్యారు.
పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామని, తమకు ప్రత్యేక కూటమి ఏదీ లేదని, జీ23 అనేది మీడియా సృష్టని వీరు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశానికి ముందు రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ పలువురు కార్యకర్తలు, నాయకులు నినాదాలిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని, కేంద్ర మంత్రికాలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఐక్యతకు గాంధీ కుటుంబం కీలకమని నాయకులు అర్థం చేసుకోవాలని గహ్లోత్ పేర్కొన్నారు.
యాక్టివ్‌గా అసమ్మతి గ్రూప్
ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి కంటే ముందే, కాంగ్రెస్‌లోని అసంతప్తి వర్గానికి చెందిన సీనియర్ నేతలు శుక్రవారం గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయి భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ వంటి ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పార్టీ అన్ని నిర్ణయాలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాలు తీసుకుంటున్నారని జీ23 లోని నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి వీడినప్పటికీ, తెర వెనుక నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తామంతా పార్టీ శ్రేయోభిలాషులమే కానీ శత్రువులం కాదు అని ఈ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment