
ద్వారక: కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీగా మిగిలిపోయిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. అసలు దేశంలో బీజేపీ మినహా జాతీయ పార్టీలేవీ లేవన్నారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్‌లో ద్వారక నుంచి పోరుబందర్ దాకా బీజేపీ రెండో విడత గుజరాత్ గౌరవ్‌యాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘దేశం పేరిట కేవలం ఓ వంశాన్ని ప్రమోట్ చేయడం, ఓ కుటుంబానికి సేవ చేయడమే కాంగ్రెస్ నేతల ఏకసూత్ర కార్యక్రమంగా మారింది. ఇక టీఆర్‌ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, అకాలీదళ్, జేఎంఎం, పీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. నమ్మిన సిద్ధాంతానికి నిలువెల్లా కట్టుబడ్డ ఏకైక జాతీయ పార్టీ దేశంలో బీజేపీ మాత్రమే’’ అని ఈ సందర్భంగా అన్నారు.
షా ఓ జూనియర్: నితీశ్
పట్నా: కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వారి విమర్శలను పట్టించుకోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షానుద్దేశిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. సామాజిక ఉద్యమ నేత జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలు ఆచరిస్తానని చెప్పుకునే నితీశ్.. అధికారం కోసం కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నారంటూ అమిత్ చేసిన ఆరోపణలపై బుధవారం ఆయన ఈ మేరకు స్పందించారు.