సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సీనియర్లు వర్సెస్ పీసీసీ అధ్యక్షుడు అన్నట్టుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉన్న పార్టీ బాధ్యతల్లో కోత పడింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరిస్తోన్న ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్‌సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ, ఇతర సంఘాల ఇన్‌చార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే కొనసాగుతానని, ఇతర బాధ్యతలు వద్దని తెలియజేస్తూ గతంలో జగ్గారెడ్డి పార్టీకి రాసిన లేఖ ఆధారంగా ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును కలిసిన అంశంపై వివరణ కోరుతూ త్వరలోనే మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. హనుమంతరావుకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జగ్గారెడ్డి బాధ్యతల తొలగింపు, వీహెచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా ఇతర అసంతృప్త నేతలను కూడా అధిష్టానం దారిలోకి తీసుకురావాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి
జగ్గారెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో విలేకరులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో మరేమైనా ఇతర పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది.
పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత: మహేశ్‌కుమార్ గౌడ్
టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి సీనియర్లు అయినా ఊరుకునేది లేదని అన్నారు. సీనియర్లంటే తమకు గౌరవం ఉందని, వారికి వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని, పార్టీని నష్టపరిచే వ్యవహారాలు మంచివి కావని సూచించారు. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment