ఒక్క అంగుళం ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నా సొంతంగా కూల్చేస్తా..
సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ నేత కేవీపీ లేఖ
బీజేపీ, బీఆర్‌ఎస్ నా ఫామ్‌హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది
పార్టీకి నష్టం కలిగే పనిచేయను.. నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టును స్వాగతిస్తున్నట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తన ఫామ్‌హౌస్‌లోని ఏ కట్టడమైనా ఒక్క అంగుళం ఎఫ్‌టీఎల్ లేదా బఫర్‌జోన్‌లో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రక టించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏవిధంగా వ్యవహరిస్తుందో, అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ–తక్కువలు అవసరం లేదు.
మీరు, నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని చేసుకుపోనిద్దాం’’అని పేర్కొంటూ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందునే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నా..
హైదరాబాద్ శివార్లలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కు సంబంధిత అధికారులను పంపాలని.. వారు చట్టప్రకారం మార్క్ చేస్తే ఆ పరిధిలో కట్టడాలేవైనా ఉంటే 48 గంటల్లో కూల్చి, ఆ వ్యర్థాలను కూడా తొలగిస్తానని కేవీపీ లేఖ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భారం పడనివ్వబోనని తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రి య పారదర్శకంగా జరగాలని.. తేదీ, సమయాన్ని ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు కూడా తీరిక చేసుకుని వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని, వారిది మొసలి కన్నీరని విమర్శించారు.
‘‘బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేయడానికి నన్ను, మా ఫామ్‌హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది. నేను కాంగ్రెస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా సమరి్థస్తాను. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’’లేఖలో కేవీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment