చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు | Series Of Setbacks For Chandrababu Naidu In Supreme Court And ACB Court In Scams Cases - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి బ్లాక్‌ ఫ్రైడే.. కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు

Published Fri, Oct 20 2023 11:59 AM | Last Updated on Fri, Oct 20 2023 2:44 PM

Court Strokes For TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు  తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి.

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది.  చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 

సిద్ధార్థ లూథ్రా వాదనలు
పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది
ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్ట్‌ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది

ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు 
ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు 
చంద్రబాబు జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లో తెలిపాం

వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్‌ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్‌నెట్‌ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పును నవంబర్‌ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

అయితే ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా..  తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్‌ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.   వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్‌ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. 

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్‌17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్‌ హరీశ్‌ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్‌ ప్రస్తావన ఉండబోదని..  నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది.

ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు 

మరోవైపు ఫైబర్‌ నెట్‌ కేసు పిటిషన్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును కోర్టులో  హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్‌ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి.  

ఏసీబీ కోర్టులోనూ.. 
లీగల్‌ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.  

తాజాగా శుక్రవారం ఈ పిటిషన్‌ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్‌ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్‌ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది.

కాల్‌ డేటా రికార్డింగ్స్‌ పిటిషన్‌ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement