తలపై చెప్పులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న నారాయణ
తిరుపతి కల్చరల్: వస్త్రాలు, చెప్పులపై ఉన్న జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సిగ్గు చేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.వెయ్యిలోపు కాటన్ దుస్తులు కొనేవారికి 12 శాతం జీఎస్టీ విధించడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి జీవో వెనుక కార్పొరేట్‌లకు లాభం చేకూర్చే విధానాలు దాగి ఉన్నాయని విమర్శించారు.
కొట్టుకొచ్చిన డబ్బుతో కమ్యూనిస్టులు బిల్డింగ్‌లు కడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించడం దుర్మార్గమన్నారు. చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామన్న సోము వీర్రాజు చరిత్రలో సారాయి వీర్రాజుగా మిగిలిపోతారన్నారు. విజయవాడలో పోయిన పరువును గుంటూరు జిన్నా టవర్ వద్ద వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.కమ్యూనిస్టులను విమర్శించే అర్హతవీర్రాజుకు లేదన్నారు.
సోము వీర్రాజుతో పాటు మరో బీజేపీ ముఖ్య నేత కల్కి ఆశ్రమానికి ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేయలేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనం వెలికి తీసుకొస్తాం అనే పేరుతో రెండు లక్షల కోట్లు బీజేపీ నేతలు కొల్లగొట్టారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పారు. సీపీఐ, సీపీఎం పునరేకీకరణకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment