మీడియాతో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని సీపీఐ 24వ జాతీయ మహాసభలు తీర్మానం చేశాయి. విజయవాడలో జరుగుతున్న మహాసభల వివరాలను ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అమర్‌జిత్‌కౌర్, అతుల్‌కుమార్ అంజాన్, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక సంస్కరణల అజెండా అమల్లో వేగం పెరిగిందని, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం ప్రజల్లో తీవ్రమైన అసమనతలకు దారితీసిందని చెప్పారు. ఫలితంగా కొద్ది మంది చేతుల్లోకే సంపద కేంద్రీకరణకు దారితీసిందన్నారు. కార్పొరేట్‌లకు రాయితీలు పెంచుతున్నారని, అదే సమయంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేదరికం పెచ్చుమీరి ఆకలి చావులు పెరిగాయని చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మహాసభ తీర్మానించినట్టు వివరించారు. అలాగే మూడేళ్ల బిడ్డకు తల్లీ, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని, తెలుగు ప్రజలు ఎక్కడకి వెళ్లినా మీ రాజధాని ఏది అంటే చెప్పలేక పోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసినట్టు చెప్పారు.
యువతరానికే నాయకత్వ పగ్గాలివ్వాలి: పార్టీ నిర్మాణంపై ప్రతినిధులు
పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దుకోకుండా ఉద్యమ పథంలో రాణించలేమని సీపీఐ జాతీయ మహాసభల్లో పలువురు ప్రతినిధులు తెగేసి చెప్పారు. విజయవాడలోని గురుదాస్ దాస్‌గుప్త నగర్‌లో జరుగుతున్న మహాసభల్లో ‘పార్టీ నిర్మాణం’పై ఆదివారం వాడివేడీ చర్చ జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. పార్టీలో వృద్ధ నేతల అనుభవాన్ని ఉపయోగించుకుంటూ యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోరారు.
కమ్యూనిజం అజేయం: 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధుల ఉద్ఘాటన
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన కమ్యూనిజానికి తిరుగులేదని, పీడిత, తాడిత జనం కోసం పోరాడే కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందని 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధులు తమ సందేశాన్ని విన్పించారు. మతతత్వ శక్తులను తిప్పికొడదామని, ఆంక్షలు పెడుతున్న అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని, పెట్టుబడిదారీ విధానాలపై రాజీలేని పోరును కొనసాగించాలని వివిధ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment