
సాక్షి, అమరావతి/నగరి: సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సతీమణి వసుమతిదేవి (65) ఆకస్మిక మృతి చెందారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసుమతిదేవి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. 1976లో తిరుపతి మహిళా వర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న సమయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1986లో వర్కింగ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్‌లో చిత్తూరు జిల్లా శాఖకు నాయకత్వం వహించారు.
నారాయణతో వివాహం తర్వాత ఆయన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, ఆమె కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సహకరించారు. ఆమె మృతి వార్తతో నగరి నియోజకవర్గంలోని స్వగ్రామం ఐనంబాకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు వసుమతి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు.
ఆమె మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి అనీరాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి రామానాయుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్ తదితరులు నారాయణను ఫోన్‌లో పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
గవర్నర్, సీఎం సంతాపం
వసుమతిదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకురాలిగా ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేసిన వసుమతి బ్యాంక్ ఉద్యోగిగా సేవలు అందించి స్వచ్చంద పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ మీడియా రంగంలోనూ వసుమతి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని గవర్నర్ తెలిపారు.
► సీపీఐ నాయకుడు కె.నారాయణ సతీమణి వసుమతి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
► వేరొక ప్రకటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment