సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా విజయవాడలో అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరు తో నిర్వహించే జాతీయ సదస్సుకు సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు, కేరళ, బిహార్ ముఖ్యమంత్రులు స్టాలిన్, పినరయి విజయన్, నితీశ్ కుమార్‌నూ ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. వచ్చే నెల 14–18 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ తరువాత తొలిసారిగా సీపీఐ నూతన రాష్ట్ర సమితి సమావేశం బుధవారం జరిగింది.
రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో, విధానాల్లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించనున్న మహాసభలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య జాతీయస్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభ ద్వారా ప్రయత్నం జరగనుందని తెలిపారు. సీపీఐ జాతీయ మహాసభకు 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఉద్యమాల విషయంలో మొహమాటం లేదు: కూనంనేని
ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి మొహమాటం లేకుండా పోరాడతామని కూనంనేని సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో మతతత్వ బీజేపీని నిలువరించేందుకు మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చామని, అదే సమయంలో ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. దేవరకొండ నియోజకవర్గంలో మహిళల శిరోముండనం ఘటనను వదిలిపెట్టబోమని, సాంఘిక దురాచారాలు, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment