డీఎంకే–కాంగ్రెస్‌ కూటమికి బీటలు | Cracks in DMK-Congress alliance In Tamil Nadu | Sakshi
Sakshi News home page

డీఎంకే–కాంగ్రెస్‌ కూటమికి బీటలు

Published Sun, Mar 7 2021 3:43 AM | Last Updated on Sun, Mar 7 2021 11:12 AM

Cracks in DMK-Congress alliance In Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేతో వియ్యమందుకున్న కాంగ్రెస్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కయ్యానికి దిగింది. యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది.

ఈసారి 18 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్‌ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్‌కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. ఐ–ప్యాక్‌ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్‌ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు.

డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్‌సీసీ అ«ధ్యక్షులు కేఎస్‌ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’తో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని సలహా ఇచ్చారు.

దీంతో అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ‘కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్‌ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కురువృద్ధుడు ఉమన్‌చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామ’ని కాంగ్రెస్‌ నేతలు బాధపడ్డారు. పైగా మలివిడత చర్చలకు రమ్మని డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోయారు.

ఈ పరిస్థితులను రాహుల్‌గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్‌ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్‌ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్‌గాంధీ చెప్పినట్లు సమాచారం. డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్‌ను కలుపుకుని పోయేందుకు కమల్‌హాసన్‌ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్‌ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్‌ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement