సాక్షి, అమరావతి: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటే ఇదేనేమో.. బీజేపీలో సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటివారు చంద్రబాబు స్లీపర్‌సెల్స్‌గా ఇప్పటికే పనిచేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి వారు బీజేపీ ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం హైరానా పడుతూ ఉంటారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇప్పుడా జాబితాలోకి వచ్చి చేరారు. బీజేపీ పచ్చబ్యాచ్‌లో కొత్తగా చేరిన ఆమె తన మరిది చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు తెగతాపత్రయ పడుతున్నారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై నాలుగేళ్లుగా టీడీపీ చేసిచేసి వదిలేసిన పసలేని, పాచిపోయిన ఆరోపణలనే ఆమె తాజాగా ఆలపిస్తున్నారు. రోజుకో అసత్య ఆరోపణతో పచ్చ మీడియాలో ప్రముఖంగా కనిపించేందుకు నానాపాట్లు పడుతున్నారు. కానీ, పురందేశ్వరి తాజాగా చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తి నిరాధారమని ఇప్పటికే పలుసార్లు స్పష్టమైంది. గతంలో టీడీపీ, ప్రస్తుతం పురందేశ్వరి చేస్తున్న దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా సమర్థంగా తిప్పికొట్టింది. ఆమె తాజాఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెవరేజస్ కార్పొరేషన్ పునరుద్ఘాటించింది.
నిజాలు చూడమ్మా.. కట్టు కథలు కట్టిపెట్టమ్మా
రాష్ట్రంలో కొన్ని డిస్టిలరీల నుంచే ప్రభుత్వం అత్యధికంగా మద్యం కొనుగోలు చేస్తోందని పురందేశ్వరి చేసిన ఆరోపణ బెడిసికట్టింది. మద్యం కొనుగోళ్ల కోసం 2015 నుంచి రాష్ట్రంలో అమలుచేస్తున్న విధానాన్నే ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఇక మద్యం కొనుగోళ్లపై ఆమె చెప్పిన లెక్కలన్నీ కాకిలెక్కలేనన్నది స్పష్టమైంది. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల నుంచి పారదర్శకంగా మద్యం కొనుగోలు చేస్తున్నారని బెవరేజస్ కార్పొరేషన్ రికార్డులు వెల్లడించాయి. అవి..
► ఆదాన్ డిస్టిలరీ నుంచి ఒక ఏడాదిలోనే రూ.1,164.38 కోట్ల విలువైన మద్యం కొన్నారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ, 2019, అక్టోబరు 1 నుంచి 2023, సెపె్టంబరు 30 వరకు అదాన్ డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.443.01 కోట్లు మాత్రమే.
► ఎస్‌పీవై డిస్టిలరీస్ నుంచి రూ.1,863 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ, ఆ డిస్టిలరీ నుంచి కూడా ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.876.38 కోట్లు విలువైన మద్యమే కొనుగోలు చేసింది.
► ఇక ఎస్‌ఎన్‌జీ డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వం రూఐ.1,996.66 కోట్లు విలువైన మద్యం కొనుగోలు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. దాని నుంచి కూడా ప్రభుత్వం రూ.1,214.40 కోట్ల మద్యమే కొనుగోలు చేసింది.
► అలాగే, రాడికో ఖైతాన్ డిస్టిలరీ నుంచి రూ.948.64 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసినట్లు పురంధేశ్వరి ఆరోపించారు. కానీ, ఆ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం రూ.719.92 కోట్ల విలువైన మద్యాన్నే కొనుగోలు చేసింది.
మద్యం మాఫియా ఆటకట్టించిన సీఎం జగన్..
నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడు మద్యం షాపులు.. ఆరు బెల్డ్ షాపులుగా యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీకి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. సీఎంవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. అంతేకాక..
► మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించి ఆ వేళలను కచి్చతంగా అమలుచేస్తున్నారు.
► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను సమూలంగా తొలగించారు.
► అలాగే, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దుచేశారు.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వపరం చేసింది.
► అంతేకాక, మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను కూడా పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులూ ఇవ్వలేదు.
► ఒక్కో వ్యక్తికి గరిష్టంగా ఆరు బాటిళ్లు అమ్మేందుకు ఉన్న పరిమితిని మూడు బాటిళ్లకు కుదించింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచారు. ఏఆర్‌ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి.
► ప్రజలను మద్యం మహమ్మారి నుంచి దూరం చేసేందుకు మద్య విమోచన కమిటీని ఏర్పాటుచేసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
► ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటుచేసి గంజాయి, అక్రమ మద్యం, సారా దందా ఆటకట్టిస్తోంది.
నగదు, డిజిటల్ విధానంలో చెల్లింపులు..
రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కూడా బెవరేజస్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది. నగదు విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏ రోజుకా రోజు ఆ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోజమచేస్తున్నారు. రోజువారి మద్యం నిల్వలు, అమ్మకాలు, బ్యాంకులో జమచేసిన నగదు వివరాలన్నీ కూడా బెవరేజస్ కార్పొరేషన్ పారదర్శకంగా వెల్లడిస్తోంది.
నాణ్యతలోనూ రాజీలేకుండా..
ఇక రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడటంలేదు. మద్యం నాణ్యతను పరీక్షించేందుకు బెవరేజస్ కార్పొరేషన్ రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ల్యాబలేటరీలను నెలకొలిపింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 96,614 శాంపిల్స్‌ను మాత్రమే పరీక్షించగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్షిస్తోంది.
రాష్ట్రంలో మద్యం
వినియోగం తగ్గిందన్న కేంద్రం..
మరోవైపు.. రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో 34.9 శాతం మంది పురుషులు, 0.4 శాతం మంది మహిళలు మద్యం సేవించేవారు. అదే 2019–21 నాటికి పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ విధానంతోనే ఈ సత్ఫలితాలు సాధ్యమయ్యాయి.
అవన్నీ చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీలే..
నిజానికి.. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. వాటన్నింటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాలే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఇక చంద్రబాబు టీడీపీ కీలక నేతలకు, వారి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకే అనుమతులిచ్చారు. ఉదా..
► పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా సుధాకర్‌కు కుమారుడు కూడా.
► శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. ఎస్పీవై ఆగ్రో ప్రొడక్షన్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు. .. ఇలా చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్యం కొనుగోలు చేస్తోంది. అందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందేముందీ? ఈ వాస్తవాలు కనిపించవా.. పురందేశ్వరి!?
చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు..
పచ్చ పైత్యంతో పురందేశ్వరి వాస్తవాలను గుర్తించడంలేదు కానీ.. మద్యం కొనుగోళ్లలో అస్మదీయుల డిస్టిలరీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు అత్యంత సన్నిహితులైన వారికే ఎక్కువ మద్యం ఆర్డర్లనీ కట్టబెట్టారు. కేవలం నాలుగైదు కంపెనీలకు మాత్రమే 70శాతం ఆర్డర్లు ఇచ్చారు. తన సన్నిహితులు, బినామీలకు ఏకపక్షంగా ఆర్డర్లు ఇచ్చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. అది ఎలాగంటే..
► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014–15 నుంచి 2018–19 వరకూ ఇష్టారాజ్యంగా మద్యం కొనుగోళ్లు చేశారు. టీడీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలో యునైటెడ్ స్పిరిట్స్‌కు 46.01%, రెండో ఏడాది 45.31%, మూడో ఏడాది 44.29%, నాలుగో ఏడాది 37.69%, ఐదో ఏడాది 31.9% ఆర్డర్లు ఇవ్వడమే దీనికి నిదర్శనం.
► అలైడ్ బ్లెండక్స్ మరియు డిస్టిలరీస్‌కు వరుసగా ఆ ఐదేళ్లలో 9.43%, 13.41%,10.04%, 10.73%, 7.53 శాతం ఆర్డర్లు దక్కాయి. ఇలా మొదటి నాలుగైదు కంపెనీలకే దాదాపు 70శాతానికి పైగా ఆర్డర్లు దక్కాయి. మిగిలిన కంపెనీలకు అరకొరగా ఇచ్చేవారు.
ఆ మతలబును ఎందుకు ప్రశ్నించలేదు?
చంద్రబాబు ప్రభుత్వంలో కూడా 100కు పైగా మద్యం డిస్టిలరీలు ఉన్నాయి. కానీ, వాటిలో కేవలం నాలుగైదు డిస్టిలరీలకే 70శాతానికి పైగా మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక ఉన్న గూడుపుఠాణి ఏమిటన్నది పురందేశ్వరి ఏనాడూ ప్రశ్నించలేదు. మరి దీనివెనుక మతలబు ఏమిటి? ఇది కుంభకోణం కాదా? మరి ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదో పురందేశ్వరే సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని డిస్టిలరీలకు దాదాపు సమానంగా మద్యం ఆర్డర్లు ఇస్తూ పారదర్శక విధానాన్ని పాటిస్తుంటే ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.
సత్ఫలితాలిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. అందుకు ఈ గణాంకాలే సాక్ష్యం..
Comments
Please login to add a commentAdd a comment