సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సహాయ పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. దొంగలు దొంగలు కలసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వార్డ్లీడర్లు, జీహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయనిధి దోచుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైట్కాలర్ క్రైమ్కి పాల్పడ్డారు’’ అని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. వరద సహాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడతూ... వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్నారు. వరదల్లో లక్షలమంది నష్టపోయారు. కొందరు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. నష్టపోయిన ప్రతి ఇంటికి యాబై వేల రూపాయిలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ ఎంగిలి మెతుకులు వేసినట్లుగా పదివేల రూపాయిలే ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, కూలిపోయిన ఇంటికి లక్ష రుపాయిలే ఇస్తాం, పాక్షికంగా కూలిపోయిన ఇంటికి రూ.50 వేలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా వ్యవహరించిందని విమర్శించారు.
‘‘ఈ సాయమన్నా ప్రజలందరికీ చేరవేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూశాం. కానీ దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వార్టు లీడర్లు, జీహెచ్ఏంసీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయనిధి దోచుకున్నారు. అడ్డగోలుగా వరద సాయాన్ని జేబులో వేసుకున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘వరద సాయం ఇస్తున్నట్లు వ్యవహరించి మరో పక్క జీహెచ్ఎంసి ఎన్నికలని ప్రజలపై రుద్దే కుట్ర జరుగుతుంది. వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్కి నోటిఫికేషన్ రావడం అందులో భాగమే' అని మండిపడ్డారు. చాలా మంది ప్రజలకు అసలు పైసా సాయం కూడా అందలేదు. వరద సహాయనిధిని టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. కొన్ని చోట్ల రూ.10వేలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ దాని నుండి టీఆర్ఎస్ కమీషన్ ఏజెంట్లు కమీషన్లు గుంజుకుంటున్నారు. ఇలా దోపిడీ జరుగుతుంది. టీఆర్ఎస్ నేతలు అధికారం అడ్డుపెట్టుకొని నీచమైన అవినీతికి పాల్పడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోర్టును కోరాం. డబ్బుల వితరణపై లెక్కా పత్రం లేదు. టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని లీడర్లు డబ్బులు పంచుతున్నారు. ఈ డబ్బు ఎవరిది? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కేసీఆర్ జాగీరా ? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పబ్లిక్ మనీ. సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బు వస్తే అది కేసీఆర్ మొఖం చూసి ఇచ్చింది కాదు. సీఎం రిలీఫ్ ఫండ్‌లో డబ్బు.. ఆ కుర్చీలో కూర్చున్నది ఎవరైనా సరే ప్రజలను ఆదుకోవడమే లక్ష్యం. అందులో ఉన్న ప్రతి పైసాకి అకౌంటబిలిటీ వుండాలి. ఆడిట్ వుండాలి’’ అన్నారు.
అలాంటిది టీఆర్ఎస్ లీడర్లు ఆ డబ్బుని అడ్డగోలుగా ఎలా డ్రా చేశారు ? పార్టీ కండువాలు కప్పుకొని బాబుగారి సొత్తు అన్నట్టు ఎలా పైసలు అడ్డగోలుగా పంచారు. అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? జీహెచ్ఎంసీ కమీషనర్ వున్నారా ? ఎంతో నిబద్దత గల వృత్తుల్లో వున్న ఐఏఎస్ అధికారులు కూడా టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారిపోయి దొంగచేతిలో తాళాలు పెట్టినట్లు వాళ్లకు డబ్బులు ఇస్తారా? వాళ్ళతో సాయం పంపిణీ చేయిస్తారా? అర్హులైన బాధితులకు సాయం అందకుండా నిస్సిగ్గుగా టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పక్కదారి పట్టిస్తుంటే.. ఈ చిల్లర రాజకీయాల్ని అధికారులు దగ్గర వుండి ప్రోత్సహించడం దారుణం. ప్రజలు కూడా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. కేసీఆర్ సర్కార్‌కు అసలు స్పృహ లేదని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. కానీ ఈ వరదల్లో కూడా బురద రాజకీయాలు మానుకోలేదు కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకూ ఎంత నష్టం కలిగిందనే అంశంపై కేసీఆర్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, పైగా సాయం అందించడంలో కూడా రాజకీయాల్ని తీసుకొచ్చి రోజుకో లెక్క చెబుతున్నారని’’ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 550 కోట్లు ప్రకటించి, దీనిపై రోజుకో మాట వినిపిస్తుందన్నారు. ‘‘ఒకరోజు రూ. 300 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇంకో రోజు రూ. 350 కోట్లు, ఈ రోజు రూ.389 కోట్లు ఖర్చుపెట్టామని అంటున్నారు. మిగతాది తర్వాత పంచుతారని అంటున్నారు. ఇదో కుట్ర. 13వ తేది తర్వాత జీహెచ్ఏంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో ఈ వరద సాయాన్ని పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.
‘‘ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. కేసీఆర్ వరదలతో బురద రాజకీయలు చేస్తున్నారు. సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదు. ముంపుకు గురికాని ప్రాంతాల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పంచుతున్న డబ్బులకు ఎకౌంటబిలిటీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇదో వైట్కాలర్ క్రైమ్. ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తూ, గులాబి ఏజెంట్లుగా మారి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న హేయమైన స్కామ్ ఇది. ఇంత చిల్లర రాజకీయం ప్రపంచంలో ఎక్కడా జరగదు. వరద సహాయాలు అందించేటప్పుడు రూ.100 చెక్కు రూపంలో ఇస్తామని, సొమ్ము చేతికిచ్చే దాఖలాలు ఎక్కడా లేవన్నారు. టీఆర్ఎస్ చిల్లర నాయకులు మాత్రం ప్రజల సొమ్ముని చేతిలోకి తీసుకున్నారని, వేల రూపాయిలు జేబులో వేసుకున్నారు. అసలు ఆ డబ్బు చేతిలోకి ఎలా వచ్చింది ? ప్రజల సొమ్ముని ముట్టుకునే అధికారం ఏ రాజ్యంగం వీరికి కల్పించింది? ఒకొక్క కార్పొరేటర్, ఒకొక్క వార్డు లీడర్ ఐదు, పది లక్షల రూపాయిలు దండుకున్నారన్నారు. ఇంత దోపిడీ, దుర్మార్గం ఎక్కడా లేదని, దీన్ని అంత సులువుగా వదలమని, ఈ దోపిడీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అధికారం అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచుకుతింటున్న వారికి శిక్ష పడాలంటే న్యాయవ్యవస్థ ముందుకు వచ్చి రక్షించాల్సిన అవసరం ఉంది. లేకపొతే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సన్నగిల్లుతుంది’’ అని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ తీరుపై కూడా దాసోజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఎన్నికల కమిషన్ కూడా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారిందని, వరదలతో రాష్ట్రం మునిగిన పరిస్థితి ఉంటే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్టోరల్ రోల్స్ అని ఎలా ముందుకు వస్తారన్నారు. మీకు ఏ మాత్రం బాధ్యత ఉన్న ప్రజలు ఈ పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత ఎలక్టోరల్ రోల్స్ వార్డుల వారీగా ఫైనలైజ్ చేయాలని ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమీషన్‌ను కూడా డిమాండ్ చేశారు. అయితే బాధల్లో ఉన్న ప్రజలకు సాయం నిపిలివేసి మరీ ఎలక్టోరల్ రోల్స్‌ని ఎలా ఫైనల్ చేస్తారు? ఏం పాలన ఇది? ఇది కేసీఆర్ ఎన్నికల కమీషనా? రాష్ట్ర ఎన్నికల కమీషనా? అసలు ఎన్నికల కమీషన్ రాజ్యంగబద్ద సంస్థయేనా? అని ప్రశ్నించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి యుద్దప్రాతిపదికన రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘‘యుద్దప్రాతిపదికన బాధితులకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. నష్టానికి సంబంధించిన అంచనాలను సర్వే చేయాలి. ఇప్పటి వరకూ ఎలాంటి జాబితా ప్రిపేర్ చేయలేదు. బాదితులు ఎవరు? ఎంతమందికి సాయం చేశారు ? ఎవరు సాయం పొందారు ఇలాంటి వివరాలు ఏమీలేవు. వార్డులవారీగా జాబితాని ప్రచురించాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ జేబులో సొమ్ము కాదు. అధికారులని, మిగతా సంస్థలని, ప్రజా సంఘాలని, స్వచ్చంద సంస్థలని కలుపుకొని వాళ్ళ ద్వారా డబ్బుల వితరణ చేయాలి. పూర్తి స్థాయిలో వరద సాహాయ నిధి ప్రజలకు చేరిన తర్వాత వార్డుల వారీగా ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్ జరగాలి'' అని దాసోజ్ శ్రవణ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment