న్యూఢిల్లీ: బీజేపీ నేతలు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలతో అందరినీ వేధించడం మానేసి, ఇకనైనా దేశం హితం కోసం మంచి పనులు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకల కేసులో భాగంగా ఈడీ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘మద్యం పాలసీలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరన్నారు.
ఢిల్లీ బడ్జెట్ అంతా కలిపి రూ.70 వేల కోట్లు. మరిక రూ.1.5 లక్షల కోట్ల స్కాం ఎలా సాధ్యం? మరో బీజేపీ నేత రూ.8 వేల కోట్ల కుంభకోణమని, ఇంకొకరు రూ. 1,100 కోట్లని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నరేమో రూ.144 కోట్లని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1 కోటి మాత్రమేనని సీబీఐ అంటోంది’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మా మంత్రి మనీశ్ సిసోడియా సొంతూరులోని నివాసం, బ్యాంకు ఖాతాల సోదాల్లోనూ సీబీఐకి ఏమీ దొరకలేదు. మరి స్కాం ఎక్కడ జరిగినట్టు?’’ అని ప్రశ్నించారు. అనవసర అంశాలపై దృష్టి పెడితే దేశం వెనుకబడిపోతుందని కేంద్రానికి హితవు పలికారు.
తెలంగాణ, ఏపీల్లోనూ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు క్రైం: ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 40 చోట్ల ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. సోదా బృందాలకు పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో తనిఖీలు జరిగాాయి. నెల్లూరు రాయాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. బీరువాలను తెరిపించి, అందులోని ఫైళ్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో నివాసముంటున్న ఎంపీ బంధువు (భార్య చెల్లెలి భర్త) శివరామకృష్ణారెడ్డి ఇంటిలోను ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే కేసులో ఈ నెల 6న కూడా ఇలాగే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment