సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి త్వరలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య చెప్పారు. అధికార టీఆర్‌ఎస్ట్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవుతోందని, ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందంటూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన మౌర్య ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
మోదీ పాలనకు అందరూ జై కొడుతున్నారు..
వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే పార్టీ బీజేపీయే. ప్రధాని పదవిలోనే ఒక వెనుకబడ్డ వర్గానికి చెందిన వ్యక్తిని ఉంచిన పార్టీ మాది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు చాలా రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవుల్లో ఓబీసీలున్నారు. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, వ్యాపారులు, రైతులు, విద్యావేత్తలు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలంతా మోదీ పాలనకు జై కొడుతున్నారు. కానీ రాష్ట్రంలో మోదీపై విషం చల్లే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితులన్నీ పరిశీలిస్తున్న ప్రజలు బీజేపీకి మరింత మద్దతు ఇస్తారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారతాయి.
టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదు..
టీఆర్‌ఎస్ కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీ. దేశంలోని చాలామందికి ఈ పార్టీ గురించి తెలియదు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. చాలా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీ ఇది. అలాంటి బీజేపీని కేంద్రంలో టీఆర్‌ఎస్ ఎలా ఎదుర్కోగలుగుతుంది? మరోవైపు టీఆర్‌ఎస్‌పై తెలంగాణలోని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రాష్ట్రాన్ని దివాలా తీయించిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఈసారి ఓటు వేసే పరిస్థితిలో లేరు. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నాం. త్వరలో తెలంగాణలో డబు ల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ప్రజలు చూడనున్నారు.
ఉత్తర, దక్షిణ భారత్‌లు రెండూ సమానమే
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీతో ఉన్న కూట మిని ప్రజలు తిరస్కరించారు. అందుకే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మాకు ఉత్తరా ది, దక్షిణాది అంతా సమానమే. ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్ నినాదాన్ని అందుకున్నది బీజేపీనే.
Comments
Please login to add a commentAdd a comment