మనంతట మనం బెల్లం.. యాలకులు.. చిక్కనిపాలు .. జీడిపప్పు వేసి వండుకుని చేసేదాన్ని పరమాన్నం అంటాం. మరి ఎవరో ఆరగించి కక్కిన కూడు పరమాన్నం అని ఎలా అంటాం?. అంత దిక్కుమాలిన గాచ్చారం ఎవరికీ ఉంటుంది. ఎవరికీ అంటే.. అంతకు మించి మరో మార్గం లేనివాళ్లకు అది తప్ప మరో గతిలేని వాళ్లకు ఆ కక్కిన కూడే మహాభాగ్యం అవుతుంది. టీడీపీ పరిస్థితి సైతం అచ్చం అలాగే ఉంది.
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసి అనైతికానికి పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వెలివేతకు గురైన ఆనం రామనారాయణ రెడ్డి (వేంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) వరుసగా టీడీపీ లీడర్లతో సమావేశమవుతూ వస్తున్నారు. వాళ్లకు మరి వేరే మార్గం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెంటేశాక వేరే మార్గం లేదు కాబట్టి టీడీపీ గుమ్మానికి వేలాడక తప్పదు. నెల్లూరులో గత ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవలేక మొత్తం పది సీట్లూ వైఎస్సార్‌సీపీకి అప్పగించి బిక్కముఖం వేసిన టీడీపీకి ఇప్పుడు సస్పెండ్ అయిన ఈ ముగ్గురే దిక్కయ్యారు.
వీళ్ళను వంద తలలు నరికివచ్చిన కాలభైరవుల్లా కీర్తిస్తూ ఎల్లో మీడియా సైతం విస్తృత కవరేజి ఇవ్వడం చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో అర్థం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత లీడర్లు పార్టీ నుంచి అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ లేక మొహం వాచిపోయిన టీడీపీ, ఎల్లోమీడియాకు కరువులో ఉన్న కుక్కకు వల్లకాట్లో ఎముక దొరికినట్లయింది. దీంతో వారినే రకరకాలుగా చూపిస్తూ ఆషాఢంలో పండగ చేసుకుంటున్నారు.
లోకేశ్ కోసమే హైప్..
త్వరలో నెల్లూరులోకి ప్రవేశించనున్న నారా లోకేష్ పాదయాత్రకు హైప్ తేవడానికి తప్ప ఈ ముగ్గురి చేరిక టీడీపీకి ఎందుకూ పనికిరాదన్న విషయం కార్యకర్తలకు అర్థం అవుతూనే ఉంది. వాస్తవానికి చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల్లో ఆమోదం ఉంది. గ్రాఫ్ పెరిగితే కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఒక్కరైనా చేరాలి కదా. మరి అలాంటి చేరిక ఒక్కటీ లేదు అంటే గత ఎన్నికల్లోనే సీఎం జగన్ చేతిలో చచ్చి మమ్మీగా మారిన శవానికి ఈ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అనే పట్టు చీర కట్టి ఉత్తుత్తి ముస్తాబు చేయడం తప్ప శవం లేచేది లేదని గ్రామస్థాయిలో కార్యకర్తలు చెవులుకొరుక్కుంటున్నారు
టీడీపీలో గొడవల మాటేమిటి..
మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు ఉంది టీడీపీ తీరు. ఆల్రెడీ టీడీపీలో కొన్నాళ్లుగా ఉంటూ వస్తున్న నాయకుల మధ్య తలెత్తుతున్న గొడవలు సర్దుబాటు చేయడం వదిలేసి వైఎస్సార్‌సీపీ నుంచి వెలివేతకు గురైన వాళ్ళను చూసి పండగ చేసుకుంటున్నట్లు ఉంది. ఇప్పటికే విజయవాడలో పార్టీకి నిప్పెట్టేసి దూరం నుంచి చలి కాస్తున్న కేశినేని నానిని ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు అటు సత్తెనపల్లిలో కోడెల శివరామ్ చేస్తున్న గాయి గత్తరను సైతం వినే ధైర్యం చేయడం లేదు. ఇక గన్నవరంలో తంగిరాల సౌమ్య ఆర్తనాదాలు అరణ్యరోదనే అవుతున్నాయి.
ఇక ఫారిన్ నుంచి నేరుగా సూట్ కేసులతో దిగిపోయి డబ్బుతో చంద్రబాబును కొట్టి చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన భాష్యం ప్రవీణ్ వ్యవహారం సైతం ఒక తలనొప్పి. రాత్రికి రాత్రి ఫారిన్ నుంచి దిగిపోయి అక్కడక్కడా సేవలు పేరిట ఈవెంట్స్ చేస్తే సరిపోతుందా? మరి మేము ఏమవ్వాలి అని వెక్కివెక్కి ఏడుస్తున్న పుల్లరావు ఆవేదన ఎవరికి వినబడడం లేదు. ప్రస్తుతానికి కొన్నాళ్ళు ఈ వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో ఈవెంట్ నడపడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబుకు అర్థం అయింది.
ఇది కూడా చదవండి: జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment