
రాకేష్ టికాయిత్
లఖింపూర్: ముఖ్యమంత్రి కావాలో, రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో తేల్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ సూచించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ వ్యతిరేకంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు.
‘యూపీ ప్రజలు తమ ఓట్లను తెలివిగా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి ప్రజాప్రతినిధులు కావాలో.. రెండవ కిమ్ జాంగ్ ఉన్(ఉత్తర కొరియా అధినేత) కావాలో తేల్చుకోవాలని కోరుతున్నాం. ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం మనకు వద్ద’ని టికాయిత్ అన్నారు.
తన స్వస్థలమైన ముజఫర్‌నగర్‌లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గత వారం ఆయన మండిపడ్డారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ‘అభివృద్ధి గురించి మాట్లాడాలని పశ్చిమ యూపీ ప్రజలు కోరుకుంటున్నారు. హిందూ, ముస్లిం, జిన్నా, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి ఓట్లు పడవు. ముజఫర్‌నగర్ హిందూ-ముస్లిం మ్యాచ్‌లకు స్టేడియం కాద’ని టికాయిత్ ట్వీట్ చేశారు.
రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, జిన్నా గురించి మాత్రమే కాకుండా తమ సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని ‘పీటీఐ’తో అన్నారు. మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకునేలా ఉద్యమించడంలో టికాయిత్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. (క్లిక్: పంజాబ్ లో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ)
Comments
Please login to add a commentAdd a comment