కాక రేపుతున్న దుబ్బాక | Dubbaka By Poll Election All Parties Criticisms Of Campaign | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీపై టీఆర్‌ఎస్‌ సీరియస్‌

Published Sat, Oct 24 2020 9:01 AM | Last Updated on Sat, Oct 24 2020 9:34 AM

Dubbaka By Poll Election All Parties Criticisms Of Campaign - Sakshi

సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోంది. రాష్ట్రం మొత్తం దుబ్బాక వైపే చూస్తుండటంతో అన్ని పార్టీల నాయకులు తమ సత్తా చాటుకునేందుకు శ్రమపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ప్రజల్లో క్రేజ్‌ పెరిగేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీల విధానాలపై టీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తుండగా.. టీఆర్‌ఎస్‌ పార్టీపై కాకుండా మంత్రి హరీశ్‌రావుపై విపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు సవాల్‌ విసురుతుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక కాస్త వేడెక్కింది.

కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 20 వేలకు పైగా బీడీ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటంతోనే బీడీ కార్మికుల కష్టాలు నేరుగా చూసి వారికి నెలకు రూ.2వేల పెన్షన్‌ ఇస్తున్నారని మంత్రి హరీశ్‌రావుతోపాటు, టీఆర్‌ఎస్‌ నాయకులు మహిళలకు చెప్పి బీడీ కార్మికుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేలా చూస్తున్నారు. అయితే బీడీ కార్మికుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ నాయకులు బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.1,600 ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఇతర పథకాలకు కూడా కేంద్రం డబ్బులు ఇస్తోందని బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో ఎవ్వరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో తేల్చేందుకు తాను సిద్ధమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సవాలు విసిరితే.. రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే ముక్కునేలకు రాసి ఎంపీ పదవి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అంతా బూటకం అని విమర్శిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చేసింది మాజీ మంత్రి ముత్యం రెడ్డి అని కాంగ్రెస్‌ నాయకులు చెబుతుండగా.. అసలు గులాబీ జెండా లేనిదే తెలంగాణ వచ్చేదా, అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేశారని ఎవరి వాదనను వారి వినిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.  

హరీశ్‌రావుపై విపక్షాల విమర్శలు 
టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేస్తుండగా.. వారు మాత్రం హరీశ్‌రావును కేంద్రగా చేసుకొని ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు ఇంతకాలం ఈ నియోజకవార్గన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలతో పోలిస్తే దుబ్బాక వెనకబడి ఉందని ఆరోపిస్తున్నారు. హరీశ్‌రావుకు తమ పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిందని, ఇక్కడికి విచ్చి ఏం చేస్తారని కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు రఘునందన్‌ రావు, బండి సంజయ్‌లు విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఇబ్బందులు ఉన్నాయని, మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్ని రైతులను మోసం చేస్తోందని టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారం అసత్యమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతీ చిన్న విషయాన్ని కూడా తమ ఎన్నికల ప్రచారఅస్త్రంగా మార్చుకొని ఎదుటి పార్టీలకు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలతో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తి పోతోంది.   

కాంగ్రెస్, బీజేపీలవి దొంగనాటకాలు
దుబ్బాక‌: తెలంగాణ ఉద్యమానికి అడ్డా దుబ్బాక గడ్డ మీద పగటి వేషాలు, పరాయి నాయకులు, కిరాయి మనుషులతో ఆడే దొంగనాటకాలు సాగవని.. చిత్తు చిత్తుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను దుబ్బాక ప్రజలు ఓడిస్తారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతాపూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండమావులాంటి కాంగ్రెస్, బీజేపీ వెంట వెళ్తే మోసపోతామన్నారు. పోరాటాల గడ్డ దుబ్బాక చరిత్ర ఉత్తమ్, బండి సంజయ్‌లకు ఏం తెలుసని, దుబ్బాక గడ్డ మీద పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతం అణువణువు తెలుసని,  చేనేతలు, బీడీ కార్మికులు, రైతుల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ సోషల్‌ మీడియా అబద్దాల పుట్టగా మారిందన్నారు. తుది శ్వాస విడిచేంత వరకు ప్రజల మధ్యనే ఉన్న రామలింగన్న ఆశయాల సాధనకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా మనముందుకు వచ్చిన సుజాతక్కకు అండగా ఉంటామని పెద్ద సంఖ్యలో వచ్చిన జనంను చూస్తుంటే లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయమైపోయిందన్నారు.  

చర్చకు రమ్మంటే సంజయ్‌ పత్తా లేడు 
దుబ్బాక తెలంగాణ తల్లి చౌరస్తాలో చర్చకు రమ్మంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటివరకు పత్తా లేడని మంత్రి ఆరోపించారు. బీడీ కార్మికులకిచ్చే పింఛన్లలో కేంద్రం రూ.1,600 ఇస్తుందంటు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అందులో కనీసం రూ.16 ఇచ్చినట్లు నిరూపించినా మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే నువ్వు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చెయాలని సవాల్‌ విసిరారు. లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, నాయకులు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతకిషన్‌రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పెరుగు పద్మపర్వతాలు, చౌడు బాల్‌లక్ష్మి, ఎంపీటీసీ రాధామనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

జూటాబాజీ మాటలు బీజేపీకే చెల్లుతాయ్‌ 
మిరుదొడ్డి(దుబ్బాక): పొద్దుగాల లేచిన నుంచి నుంచి పొద్దుపోయే దాకా జాటాబాజీ డోకాబాజీ మాటలు మాట్లాడే పార్టీ ఏదైతే ఉందో అది ఒక్క బీజేపీకే చెల్లుతుందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం వివిధ పార్టీకు చెందిన కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకు అభ్యర్థి సోలిపేట సుజాతను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీపీ గజ్జెల సాయిలు, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

గులాబీ వైపు ముంపు గ్రామాల ప్రజలు 
సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్‌ల కోసం ఆనాడు భూమి ఇచ్చి స్ఫూర్తిగా నిలిచిన ముంపు గ్రామాల ప్రజలు నేడు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు నిలబడడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముంపు గ్రామం ఎటిగడ్డ కిష్టాపూర్‌ ప్రజలు శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొన్న పల్లెపహాడ్, నిన్న వేములఘట్, నేడు ఏటిగడ్డ కిష్టాపూర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్,  జెడ్పీటీసీ ఇంద్రాసేనారెడ్డి, శ్రీకాంత్‌ ఉన్నారు.  

బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందే.. 
రాయపోలు(దుబ్బాక): కాంగ్రెసోళ్లకు ఓటేస్తే కాలిపోయే మోటార్లు దిక్కయినయి.. ఇప్పుడు బీజేపోళ్లకు ఓటేస్తే మోటార్ల కాడ మీటర్లు పెడ్తమంటున్నరు.. మరి ఎవరికేద్దాం ఓటు.. అని ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లను ప్రశ్నించారు. రాయపోలు మండలం రామారంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోలు మాజీ ఎంపీపీ వైస్‌ చైర్మన్‌ తలారి నర్సింలుతో సహా 50 మంది వరకు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. 

‘టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటాం’
దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు అండగా ఉంటామని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం దుబ్బాకలో నియోజకవర్గంలోని అన్ని మండలాల మాదిగ సంఘం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాదిగల సంక్షేమానికి కృషి చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డప్పు శివరాజ్, మాదిగల రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు సాంబయ్య, స్వామి, రాంచంద్రం, బెల్లె బాల్‌నర్సయ్య, స్వామి, చరణ్‌ తేజ, తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement