
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై రెచ్చగొట్టేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి గురువారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయ శిక్షాస్మృతిని, ఎన్నికల కోడ్‌ను మమతా బెనర్జీ ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఈసీ ఆ నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మమతను ఆదేశించింది.
‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది. 1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈసీ నోటీసులను పట్టించుకోబోనన్నారు. సీఆర్‌పీఎఫ్‌పై తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్‌పీఎఫ్ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్ చేస్తాను’ అని స్పష్టం చేశారు.
‘మీ షోకాజ్ నోటీసులను నేను పట్టించుకోను. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల రోజున ప్రధాన మంత్రి ప్రచారం చేస్తే మీ దృష్టిలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ఈసీని ప్రశ్నించారు. జమల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం మమత పాల్గొన్నారు. దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను, ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
బెంగాల్‌లో హింసకు అమిత్ షా కుట్ర
రాష్ట్రంలో హింసను రాజేసేందుకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడేలా పోలీసులను ప్రోత్సహిస్తున్నారన్నారు. షాను నియంత్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి గూండా హోం మంత్రిని నా జీవితంలో చూడలేదు. ఆయన పులి కన్నా ప్రమాదకరం. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్తున్నారు. షాను నియంత్రించాలని ప్రధానిని కోరుతున్నా. ఆయన వల్ల బెంగాల్‌లో అల్లర్లు, హింస చెలరేగే ప్రమాదముంది’ అని మమత ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారకుండా చూడాలని, బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్ధించారు.
Comments
Please login to add a commentAdd a comment