లోక్‌సభ ఎన్నికలను నాగాలాండ్‌లోని ఒక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీవో) రాష్ట్రంలోని ఆరు జిల్లాలను కలిపి ప్రత్యేక పరిపాలన కేంద్రం లేదా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూవస్తోంది. వీటిని నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది.
ఈఎన్‌పీవోతో పాటు అపెక్స్ నాగా బాడీ, ఆరు జిల్లాల్లోని దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ గత సంవత్సరం (ఫిబ్రవరి 27) అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అయితే ఆ తరువాత ఈ విషయమై ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఏకే మిశ్రా అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
అనంతరం కమిటీ సభ్యులు నాగాలాండ్‌ను అనేకసార్లు సందర్శించి, అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు నాగాలాండ్‌లోని తూర్పు ప్రాంత ప్రజలకు స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఇటీవల తెలిపారు. కాగా ఇఎన్‌పీవో ఇప్పటికే పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఏ పార్టీకి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment